ఎత్తుకుపైఎత్తు... ఫలించిన తెరాస వ్యూహం ఎన్నిక ఏదైనా ఘన విజయం నమోదు చేయాలన్న పంతాన్ని తెరాస మరోసారి నిలబెట్టుకుంది. ఆరు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకొని మరోసారి సత్తా చాటింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తెరాస అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో రెండు పట్టభద్రుల స్థానాల్లో గెలుపు, ఓటములు భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశమున్నందున సవాలుగా తీసుకుంది.
ఓట్ల నమోదు ప్రక్రియ నుంచే ప్రణాళికబద్ధంగా కసరత్తు చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేశారు. సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులతోపాటు సాధారణ పట్టభద్రులను చైతన్య పరిచి భారీగా ఓట్లు నమోదు చేయించారు.
ఎత్తుగడలతో ముందుకు...
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం వరకు వ్యూహాత్మక ఎత్తుగడలతో తెరాస దూసుకెళ్లింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును చాలా రోజుల క్రితమే ప్రచారంలోకి తీసుకొచ్చింది. బహుముఖ పోటీ ఉన్నప్పటికీ వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానం తిరిగి కైవసం చేసుకుంటామని మొదటి నుంచి ధీమా వ్యక్తం చేసింది.
సానుకూల అంశం...
హైదరాబాద్-రంగారెడ్డి- నల్గొండ స్థానాన్ని తెరాస అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. భాజపా సిట్టింగ్ స్థానంలో జెండా ఎగరేసే లక్ష్యంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రత్యర్థుల అంచనాలకు చిక్కని విధంగా, అనూహ్యంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవిని తెరాస బరిలోకి దించడం సానుకూల అంశాల్లో ఒకటిగా మారింది.
అస్త్రశస్త్రాలతో...
వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే తెరాస అన్ని అస్త్రాలను బయటకు తీసి.. విస్తృతస్థాయి ప్రచారం చేసింది. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజూ సమీక్షించి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డికి రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ బాధ్యతలు అప్పగించారు. ఇక తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ రోజూ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించి తెరాస వాణిని బలంగా పట్టభద్రుల్లోకి తీసుకెళ్లారు.
ప్రతీ ఓటరును కలిసేలా...
హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో గెలిచి భాజపా మీద పైచేయి సాధించాలన్న తెరాస ఎత్తుగడ ఫలించింది. ఓ వైపు సమావేశాలు, సభలతోపాటు మరోవైపు ప్రతీ ఓటరును నేరుగా కలిసి ఓటడిగేలా వ్యూహాలతో ముందుకెళ్లారు. ప్రతీ యాభై ఓటర్లకు ఒక స్థానిక నాయకుడిని నియమించి.. ఓటర్లను కలిశారు. ప్రచారంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే విపక్షాలపై ముఖ్యంగా భాజపాపై విమర్శలు సంధించారు.
ఎదురుదాడి...
ప్రభుత్వానికి, పార్టీకి ఉద్యోగులు, నిరుద్యోగులు వ్యతిరేకంగా లేరంటూ ప్రచారం చేశారు. అన్ని పార్టీలూ ఉద్యోగాల కల్పనే ప్రధాన అంశంగా తీసుకున్నందున.. తెరాస మొదటి నుంచి ఎదురుదాడి చేసింది. ప్రభుత్వ రంగంలో లక్షా 33 వేల ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమదేనని పదే పదే ప్రచారం చేసింది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్, విద్యా సంస్థల ఏర్పాటు, నిధుల కేటాయింపులో అన్యాయం చేసిందని ధ్వజమెత్తింది. వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులు అనుకున్న విధంగా ఫలించాయి. పోలింగ్ పెరగడం కూడా అనుకూలించిందని తెరాస నేతలు భావిస్తున్నారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ స్థానంలో వ్యతిరేక ఓటు తీన్మార్ మల్లన్న, కోదండరాం మధ్య చీలడం కూడా పల్లాకు కలిసొచ్చింది.
ఇదీ చూడండి:ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన సురభి వాణీదేవి