పురపోరులో అత్యధిక వార్డులను కైవసం చేసుకున్న తెరాస... తొమ్మిది నగర పాలక సంస్థలు... 118 పురపాలక సంఘాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. స్వతంత్రుల మద్దతుతో పాటు... ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లలో తెరాస ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత సాధించింది.
ఆధిక్యం లేనిచోట స్వతంత్రుల మద్దతుతో..
నిజామాబాద్, రామగుండం, మీర్పేట్, బండ్లగూడ, బోడుప్పల్ మేయర్ స్థానానికి అవసరమైన మెజార్టీ ఏ పార్టీకి లేదు. బోడుప్పల్లో తెరాస రెబల్స్‌గా పోటీ చేసి గెలిచిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో పాటు... మంత్రి మల్లారెడ్డి, ఒకరిద్దరు ఎమ్మెల్సీలు.. ఎక్స్ అఫిషియో ఓటుతో సునాయసంగా మేయర్, డిప్యూటీ మేయర్ దక్కించుకోనుంది. రామగుండంలో తెరాస 18 స్థానాల్లో విజయం సాధించగా.. ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన 16 మంది తెరాస రెబల్స్ మద్దతు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మీర్‌పేటలో మొత్తం 46 స్థానాల్లో తెరాస 19... భాజపా 16 స్థానాల్లో గెలిచింది. అక్కడ గెలిచిన 8 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో కొందరు తెరాసకే మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇందూరును ఇలా పంచుకున్నారు
నిజామాబాద్ కార్పొరేషన్లో తెరాస... ఎంఐఎం మద్దతు తీసుకోనుంది. గులాబీ పార్టీకి మేయర్, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అందరూ కలిపి ఐదు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. బడంగ్‌పేట కార్పొరేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ 32 స్థానాల్లో తెరాస 13, భాజపా 10, కాంగ్రెస్ 7, స్వతంత్రులు ఇద్దరు గెలిచారు. స్వతంత్రుల మద్దతును తెరాస కూడగట్టుకుంటోంది. సబిత ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్సీలు నాయని నర్సింహారెడ్డి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, ఎగ్గే మల్లేశం ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేశారు.