TRS Protest against PM Comments : తెలంగాణ ఏర్పాటు అంశం మరోసారి రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ప్రకంపనలు రేపింది. బడ్జెట్ ప్రసంగంపై రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. తెలంగాణపై ప్రధాని అక్కసు వెల్లగక్కారంటూ అధికార తెరాస రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కింది. హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద తెరాస నేతలు, మంత్రులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పాతబస్తీ మోతెనగర్‌లో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో నిరనస ర్యాలీ నిర్వహించారు. అజంపురా చౌరస్తాలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. కేంద్ర సర్కార్ సాయం చేయకపోయినా దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రంగా ఎదుగుతోందని హోంమంత్రి తెలిపారు.
మంత్రి హరీశ్ ఫైర్
Harish rao fires against PM Comments : ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు భగ్గుమన్నారు. సాగుచట్టాలను రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారని అన్నారు. రాజ్యసభలో భాజపాకు మెజార్టీ లేకపోయినా బిల్లు ఆమోదమెలా? అని ప్రశ్నించారు. 33 పార్టీలు సమర్థించిన తెలంగాణ బిల్లు అక్రమమా? ట్విటర్ వేదికగా నిలదీశారు. 4 కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను మోదీ అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బాలంరాయిలో తెరాస శ్రేణులతో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు.
నినాదాలతో హోరెత్తించిన తెరాస
సికింద్రాబాద్‌లో తెరాస నాయకులు, కార్యకర్తల నల్లబ్యాడ్జీలు, జెండాలతో నిర్వహించిన బైక్‌ర్యాలీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తెలంగాణ పట్ల ప్రధాని అక్కసును వెళ్లగక్కారని మంత్రి ఆరోపించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలను భాజపా అమలు చేసిందా? అని తలసాని ప్రశ్నించారు. కశ్మీర్ విషయంలో భాజపా ఏ విధంగా చేసిందని అన్నారు. రాజ్యాంగానికి ఇప్పటికే 105 సార్లు సవరణలు చేశారన్న తలసాని... అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చని అంబేడ్కర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రధానిని సీఎం రిసీవ్ చేసుకోవాలని రాజ్యాంగంలో ఉందా? అని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని మోదీ చూస్తున్నారన్న తలసాని... కేంద్రమంత్రి, భాజపా ఎంపీలు రాష్ట్రానికి ఏం తెచ్చారని నిలదీశారు. కూకట్‌పల్లిలో తెరాస శ్రేణులు నిర్వహించిన బైక్‌ర్యాలీలో ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్నారు.