ముఖ్యమంత్రి కేసీఆర్పై సామాజిక మాధ్యమాల వేదికగా తీన్మార్ మల్లన్న అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసున్నారంటూ... తెరాస సోషల్ మీడియా కన్వీనర్లు హైదరాబాద్ సీసీస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్ అనే వృత్తిని అడ్డుపెట్టుకొని... యూట్యూబ్ అడ్డాగా ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కన్వీనర్ క్రిశాంక్ అన్నారు. ఆయనపై నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రజాస్వామికంగా ఓ వ్యక్తి బయటకొచ్చి... తీన్మార్ మల్లన్న తనను బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడని క్రిశాంక్ తెలిపారు. పోలీసుల దర్యాప్తును ఎదుర్కోలేక మల్లన్న.. కరోనా అని చెప్తూ తిరగడం హాస్యాస్పదమన్నారు. కరోనా ఆరు రోజుల్లో వచ్చి పోవడమేంటని ఆయన ప్రశ్నించారు. కేవలం పోలీసుల విచారణను కప్పిపుచ్చుకోవడానికే సీఎం కేసీఆర్పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని క్రిశాంక్ అన్నారు.
బొక్కలో ఏశి తోముతున్నరు
ఉత్తర ప్రదేశ్లో ముఖ్యమంత్రిని ఏమన్నా అంటే... 24 గంటల్లోపే జైలుకి తరలించి వారిపై చర్యలు తీసుకుంటున్నారని క్రిశాంక్ తెలిపారు. అలాగే ఏపీలో ఒక ఎంపీ... ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం.. ఓ కేంద్రమంత్రి గురించి తప్పుగా మాట్లాడినందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. అలాగే సీఎం కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడిన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరినట్లు వివరించారు.