TRS Protests Today: వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరుకు వ్యతిరేకంగా.. నిరసనలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నేడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెరాస నిరసనలు చేయనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కేసీఆర్ సూచించారు.
గ్రామగ్రామానా నిరసనలు
TRS Protests on Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబడుతున్న తెరాస.... పోరును కొనసాగిస్తోంది. ఓ వైపు మంత్రులు, ఎంపీలు కేంద్రమంత్రులను కలిసేందుకు దిల్లీకి వెళ్లగా... మరోవైపు గ్రామగ్రామానా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఇవాళ ఊరూరా చావుడప్పు, ర్యాలీలతో ఆందోళన చేసేందుకు గులాబీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. భాజపా మోసాలు, నాటకాలు ప్రజలకు తెలిసేలా నిరసనలు సాగాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మార్గనిర్దేశం చేశారు. ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాసినా, కేంద్రమంత్రులను కోరినా, పార్లమెంటులో నిరసన తెలిపినా.. కేంద్రం నుంచి స్పందన లేదని కేటీఆర్ విమర్శించారు. కేంద్రం దిగివచ్చే వరకూ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కోటి సంతకాలు సేకరించి పంపుతామని పేర్కొన్నారు. రైతులను చైతన్యపరిచి ఉద్యమస్ఫూర్తిలో నిరసనలు సాగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.