TRS Protest in Delhi: దిల్లీలో తెరాస ధాన్యం దంగల్‌కు సిద్ధమైంది. తెలంగాణలో పండిన ప్రతివడ్ల గింజనూ కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో పోరు దీక్ష చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధమార్గాల్లో ఉద్యమిస్తున్న గులాబీ పార్టీ.. మరింత ఒత్తిడి పెంచేందుకు హస్తినలో దీక్ష చేయనుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెరాస దిల్లీలో తొలిసారి సమరశంఖం పూరించనుంది. తెలంగాణ భవన్‌లో రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో దీక్షను చేపట్టనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి, మండల పరిషత్, పురపాలక సంఘాల అధ్యక్షులు, అన్ని కార్పొరేషన్ల ఛైర్మన్లు, తెరాస రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు భాగస్వామ్యులు కానున్నారు. దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం రాత్రే దిల్లీకి చేరుకున్నారు.
మద్దతు ప్రకటించిన టికాయిత్: తొలుత రోజంతా దీక్ష కొనసాగించాలని భావించారు. ఐతే 72 ఏళ్లలో ఏప్రిల్ తొలి పదిహేను రోజుల్లో ఎన్నడూ లేనంత వేడి దిల్లీలో శనివారం నమోదైందని భారతీయ వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో పాటు వడగాలుల తీవ్రత ఉంటుందని హెచ్చరించడంతో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగించేలా మార్పులు చేశారు. దీక్ష ఏర్పాట్లపై దిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ తన నివాసంలో ఆదివారం రాత్రి మంత్రులు, ముఖ్యనేతలతో సమీక్షించారు. సమస్య తీవ్రతను దేశం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్న తెరాస నేతలు దీక్షకు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ సహా పలువురు రైతు నేతలను ఆహ్వానించారు. టికాయిత్ ఇప్పటికే మద్దతు ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రం తాము చెప్పినదే చెల్లుబాటు కావాలన్న రీతిలో ముందుకు వెళ్లడం మంచిది కాదని.. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హితవుపలికారు.
చిన్నచూపు చూస్తే కేంద్రానికే నష్టం.. "దేశంలో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడాన్ని కేంద్ర ప్రభుత్వం తక్కువ చేసి చూడడం మంచిది కాదు. రైతుసమాజ అభీష్టాన్ని పరిగణనలోకి తీసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవడం సముచితంగా ఉంటుంది. కేంద్రం తాము చెప్పిందే చెల్లుబాటు కావాలన్న రీతిలో ముందుకు వెళ్లడం మంచిది కాదు. రైతన్నలకు ఇంకా క్షోభ కలిగించడం సరికాదు. ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం దారుణం. ఇదే భాజపా ప్రభుత్వంలో వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు రంగుమారిన ధాన్యం కూడా మద్దతు ధరతో కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. కోటాను కోట్ల వ్యవసాయ కుటుంబాలను పట్టించుకోకపోవడం మంచిది కాదు. రాష్ట్రంలో యాసంగిలో పండిన మొత్తం పంటను ఏలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి." -నిరంజన్ రెడ్డి, మంత్రి