TRS Plenary 2022: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు.. కేంద్రంతో ఢీ అంటే ఢీ.. అధికార, విపక్షాల మధ్య వాడీవేడి విమర్శలు, ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు కేసీఆర్ సన్నాహాల నేపథ్యంలో తెరాస ప్లీనరీ రేపు జరగబోతోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం హెచ్ఐసీసీలో రాష్ట్ర ప్రతినిధుల మహాసభ జరగనుంది. ఉదయం పది గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గం, రాజ్యసభ, లోక్‌సభల సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా మొత్తం మూడు వేలమందికి ఆహ్వానం పంపించారు.
పురుషులు గులాబీరంగు దుస్తులు, మహిళలు అదే రంగు చీరలతో హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది. ఉదయం 10 గంటల వరకు ప్రతినిధుల నమోదు... 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పతాకావిష్కరణ చేస్తారు. తర్వాత తెలంగాణ తల్లికి, అమరవీరులకు నివాళి అర్పించి... అనంతరం స్వాగతోపన్యాసం ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగే ప్లీనరీలో తీర్మానాలకు ప్రాధాన్యం ఉంది. ఈసారి 11 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.