గ్రేటర్‌లోని అఖిల పక్షం నాయకులతో జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ పంకజ సమావేశం నిర్వహించారు. ఫొటో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ-2021, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌పై ఎజెండాగా చర్చించారు. గ్రేటర్లో ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల భవనాలు కూల్చివేయడం వల్ల 72 పోలింగ్ కేంద్రాలను మార్చుటకు.. మరో 16 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు.
ప్రతిపాదనలు చేయాలి
కొత్తగా ఏమైనా పోలింగ్ కేంద్రాల లొకేషన్స్‌లో మార్పుల గురించి మీ దృష్టిలో ఉంటే వెంటనే ప్రతిపాదనలు చేయాలని అధికారులు కోరారు. ఇది ప్రాథమిక సమావేశం మాత్రమేనని.. ఈ ప్రతిపాదనల గురించి మీ అభిప్రాయాలు తెలియజేయాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం నియోజకవర్గాల వారీగా ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల ఆధ్వర్యంలో.. రాజకీయ పార్టీలతో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధనపు కమిషనర్ పంకజ తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే సమావేశంలో కూడా మార్పుల గురించి ఇచ్చే ప్రతిపాదనల ప్రతులను కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలో ఇవ్వాలని సూచించారు.
ఈవీఎం, బ్యాలెట్ రెండింటితోనూ ముప్పు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓటర్లను నమోదు చేసేందుకు అధికార పార్టీ ప్లాన్ చేస్తోందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. అఖిలపక్ష సమావేశానికి హైదారాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రాకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారకుండా, ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలోనే రిజర్వేషన్లు అడ్డగోలుగా జరిగాయని గుర్తుచేశారు. ఈసారి కచ్చితంగా రిజర్వేషన్లు సరి చేయాలన్నారు. ఈవీఎం, బ్యాలెట్ రెండింటితోనూ ముప్పు ఉందన్నారు. నిపుణుల తో చర్చించి దేని ద్వారా తక్కువ నష్టం ఉంటే వాటి ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.