హైదరాబాద్ నగర తెరాస శ్రేణులతో ఈనెల 7న ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం కానున్నారు. జలవిహార్లో ఉదయం 10 గంటలకు సమావేశం జరగనుందని పార్టీ నేతలు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర ముఖ్యనేతలందరూ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణంపై సమావేశంలో వ్యూహాలు ఖరారు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వార్డు స్థాయి, నగరాలు, పట్టణాల్లో డివిజన్ స్థాయి పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ నిన్న ప్రారంభించింది. అయితే హైదరాబాద్‌లో డివిజన్ స్థాయితో పాటు బస్తీ కమిటీలనూ ఏర్పాటు చేసేందుకు తెరాస సిద్ధమవుతోంది. రాష్ట్ర కమిటీ, అనుబంధ సంఘాల కమిటీల్లో నగర నేతలకు ప్రాధాన్యమిచ్చే ఆలోచనలో ఉన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
గతంలో సంస్థాగత నిర్మాణంపై కేటీఆర్ ఏమన్నారంటే..
సెప్టెంబర్‌లో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోబోతున్నట్లు.. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదివరకే తెలిపారు. సెప్టెంబర్‌లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో తెరాస ద్విదశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ తెలిపారు.
దిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన..
నిన్న దిల్లీలో తెరాస కార్యాలయానికి పార్టీ అధినేత కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇందుకు మంత్రులు సహా పార్టీ ముఖ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. దిల్లీలో తెరాస భవనం తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి చిహ్నమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యం వద్ద ఊపిరిపోసుకున్న తెరాస.. దిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజచేయడం చారిత్రక ఘట్టమని ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదీచూడండి:Trs Bhavan in Delhi: మరో కీలక ఘట్టానికి నాంది... దిల్లీలో తెరాస భవనానికి భూమిపూజ