తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూర్​ నగర్​ గెలుపు కోసం కారు గేర్లు

హుజూర్​నగర్​ను కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. షెడ్యూల్ వెల్లడైన కొద్దిసేపటికే.. అభ్యర్థిని ప్రకటించి.. తన దూకుడును ప్రదర్శించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోటలో పాగా వేసి.. తమ బలాన్ని ప్రదర్శించాలని తెరాస ఉవ్విళ్లూరుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రజా ప్రతినిధులందరితో పాటు... కీలక నేతలను మొహరించేందుకు వ్యూహాలు రూపొందిస్తోంది.

హుజూర్​ నగర్​ గెలుపుకు కారు గేర్లు

By

Published : Sep 22, 2019, 5:09 AM IST

Updated : Sep 22, 2019, 7:36 AM IST

హుజూర్​ నగర్​ గెలుపు కోసం కారు గేర్లు

పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు స్థానాల్లో ఓటమి పాలైన తెరాస.. హుజూర్​నగర్​లో జెండా ఎగరేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఉరకలు వేస్తోంది. ఉపఎన్నికల్లో గెలిచేందుకు అస్త్ర శస్త్రాలకు పదును పెడుతోంది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన వెంటనే అభ్యర్థిని ప్రకటించి తన సన్నద్ధతను ప్రదర్శించింది. 2018 ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్​లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డిపై 23,924 ఓట్లతో గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓడిపోయిన సైదిరెడ్డినే.. మళ్లీ బరిలోకి దించింది. శంకరమ్మ, అప్పిరెడ్డి వంటి నేతలు మళ్లీ టికెట్ ఆశించినా.. సైదిరెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. తెరాస అధికారంలో ఉన్నందున నియోజకవర్గంలోనూ అదే పార్టీ ఉంటే.. అభివృద్ధి వేగంగా జరుగుతుందని అంతర్లీనంగా ప్రచారం చేయాలని తెరాస ప్రణాళికలు చేస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని.. అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై దృష్టి సారించలేదని ప్రధానంగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది.

ద్విముఖ వ్యూహంతో..:

నెల రోజుల పాటు ఓ వైపు కాంగ్రెస్​ను విమర్శిస్తూ.. మరో వైపు కేసీఆర్ సర్కారు విజయాలను ప్రదర్శిస్తూ.. ద్విముఖ వ్యూహంతో ఓటర్లను ఆకట్టుకునేలా తెరాస వ్యూహాలు రూపొందిస్తోంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరినీ రంగంలోకి దించనున్నారు. రాష్ట్రస్థాయి కీలక నేతలను కూడా కొందరిని ప్రత్యక్షంగా, మరికొందరిని పరోక్షంగా భాగస్వామ్యం చేయాలని గులాబీ పార్టీ ప్రణాళిక చేస్తోంది. హుజూర్ నగర్​లో పాగా వేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్​పై తమ బలాన్ని ప్రదర్శించి.. హస్తంను దెబ్బతీయోచ్చని ఆలోచిస్తోంది. ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్​లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని తెరాస ధీమాతో ఉంది.

కేసీఆర్​ ప్రచారానికి వెళ్తారా..?

అభ్యర్థిని గెలిపించే బాధ్యతను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భుజాన వేసుకున్నారు. కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు హుజూర్ నగర్​లో ప్రచారానికి వెళ్లనున్నారు. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారానికి వెళ్లాలా వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇవీ చూడండి: దిల్లీలో ఎన్డీఏ ముఖ్యనేతల సమావేశం

Last Updated : Sep 22, 2019, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details