పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి సవాల్‌గా మారాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో రెండు పట్టభద్రుల స్థానాల్లో గెలుపు, ఓటములు రాజకీయంగా ప్రభావం చూపే అవకాశమున్నందున.. గులాబీ పార్టీ వాటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా తెరాస ఓ వైపు తెరవెనక వ్యూహాలు, మరోవైపు బహిరంగ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఓట్ల నమోదు ప్రక్రియ నుంచే తెరాస పకడ్బందీ ప్రణాళికతో కసరత్తు చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేశారు. సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులతో పాటు.. సాధారణ పట్టభద్రులను చైతన్యపరిచి భారీగా ఓట్లు నమోదు చేయించారు.
వ్యూహాత్మక ఎత్తుగడలతో..
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం వరకు కూడా వ్యూహాత్మక ఎత్తుగడలతో తెరాస దూసుకెళ్తోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును చాలా రోజుల క్రితమే ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెజస, భాజపా, కాంగ్రెస్ నుంచి పోటీ ఉన్నప్పటికీ.. వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానం తిరిగి కైవసం చేసుకుంటామని గులాబీ పార్టీ ధీమాతో ఉంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానాన్ని తెరాస అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భాజపా సిట్టింగ్ స్థానంలో జెండా ఎగరేసే లక్ష్యంతో... వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రత్యర్థుల అంచనాలకు చిక్కని విధంగా, అనూహ్యంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణిదేవిని తెరాస బరిలోకి దించింది. వాణిదేవిని ప్రకటించిన వెంటనే అన్ని అస్త్రాలను బయటకు తీసి.. విస్తృతస్థాయి ప్రచారం సాగిస్తోంది.
శ్రేణులకు సీఎం దిశానిర్దేశం
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో రెండు పట్టభద్రుల స్థానాల్లో గెలుపు, ఓటములు రాజకీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో.. తెరాస మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను లోతుగా విశ్లేషించుకున్న గులాబీ పార్టీ.. అప్పుడు జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. ఎక్కడా అతి విశ్వాసం ప్రదర్శించకుండా.. ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని పార్టీ శ్రేణులకు నాయకత్వం పదే పదే చెబుతోంది. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజూ సమీక్షిస్తూ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ రోజూ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సురభి వాణిదేవి గెలుపు బాధ్యతలను కేటీఆర్ భుజాన వేసుకున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు, మహిళలు, ఇలా విభిన్న రంగాలకు చెందిన పట్టభద్రులతో సమావేశాలు జరుపుతున్నారు.