పెద్దల సభలకు అభ్యర్థులను నిర్ణయించేందుకు తెరాస.. ఆశావహుల జాబితా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న రెండు రాజ్యసభ స్థానాలు, భర్తీ కావాల్సిన రెండు శాసనమండలి పదవులకు అభ్యర్థుల ఎంపికపై... తెరాస అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం కసరత్తు చేశారు. ఈనెల 11, 13న ప్రకటించే అవకాశం ఉంది. నేడు లేదా గురువారం పేర్లు ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఒకటి కేశవరావు...మరో స్థానానికి పోటీ
రాజ్యసభలో రెండు స్థానాలకుగాను ప్రస్తుత సభ్యుడు కేశవరావుకు మరో అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత తెలిపినట్లు సమాచారం. రెండో స్థానానికి పార్టీలో పోటీ నెలకొంది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ఎంపిక కోసం వినతులు వచ్చాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఆశావహంగా ఉన్నారు. కేసీఆర్ సన్నిహితుడు దామోదర్‌రావు, హెటిరో ఔషధ సంస్థ అధిపతి పార్థసారథి రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ కోటా కింద ఒక స్థానం కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
స్థానిక సంస్థల కింద ఒకటి...గవర్నర్ కోటాలో మరొకటి
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్సీ పదవికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీనికి మాజీ సభాపతి సురేశ్‌రెడ్డి , మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముజీబ్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సురేశ్‌రెడ్డి ఈ పదవి వద్దనుకుంటే ముజీబ్ లేదా నర్సారెడ్డికి దక్కే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో ఒక స్థానం భర్తీ కావాల్సి ఉంది. దీన్ని దేశపతి శ్రీనివాస్, గ్యాదరి బాలమల్లు ఆశిస్తున్నారు.
మెుత్తం 4 స్థానాలు...
సోమవారం సీఎం కేసీఆర్ ఆశావహుల జాబితా పరిశీలించి... వివిధ సమీకరణలు అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేటీఆర్ సహా పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నట్లు సమాచారం. మంగళవారం నాటికి స్పష్టత వస్తే బుధవారం ఉదయం 4 స్థానాలకు పార్టీ నిర్ణయం ప్రకటిస్తారు. అదే రోజు రెండు స్థానాల్లో రాజ్యసభ సభ్యత్వాలకు నామినేషన్లు వేయిస్తారు. 12 వరకు కసరత్తు కొనసాగితే అదే రోజు రాత్రి మొత్తం 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇందులో ఇద్దరు అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికలకు 13న నామినేషన్లు వేస్తారు.
ఆశావహుల జాబితా వెల్లడికి తెరాస సన్నాహాలు ఇవీ చూడండి : ముఖ్యమంత్రికి రక్షణగా నారీశక్తి