TRS Parliamentary Party Meeting: రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్లాలని, పార్లమెంట్ సమావేశాల్లో బలంగా వాణి వినిపించాలని తెరాస ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్(pragathi bhavan)లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్... తెరాస ఎంపీ(trs mp's)లకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ధాన్యం కొనుగోళ్ల విధానం(paddy procurement), కేంద్రం అనుసరిస్తున్న తీరు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(piyush goyal)తో జరిపిన చర్చల వివరాలు... తదితరాలపై భేటీలో చర్చ జరిగింది.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడం
ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్... పంటల కొనుగోలుకు సంబంధించి జాతీయ విధానం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ చట్టాల రద్దు కోసం పోరాడాలని ఎంపీలకు సూచించారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం పట్టుబట్టాలని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి విషయమై ప్రశ్నించాలని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి... కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోవాలన్న ఆయన... పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ, తెరాస వాణి బలంగా వినిపించాలని ఎంపీలకు తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగడుతూ పార్లమెంట్లో తీవ్ర నిరసనలు వ్యక్తం చేయాలని తెరాస భావిస్తోంది. వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా రైతుల సమస్యలు, ధాన్యం సేకరణపై సమగ్రవిధానం వంటి వాటిని ప్రస్తావించే వీలుంది.
ఇదీ చదవండి:
Telangana Cabinet Meeting: రేపు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం.. ధాన్యం కొనుగోలే కీలకాంశం