ముఖ్యమంత్రి కేసీర్ ఆదేశిస్తే.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఐకాస నేతలతో చర్చించనున్నట్లు... తెరాస రాజ్యసభ సభ్యుడు కేకే వెల్లడించారు. తెరాస పార్లమెంటారీ నేత కేకే... దిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు మధ్యవర్తిత్వం వహించమని కోరిన విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. కార్మికులు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొని.. వెంటనే సమ్మెను విరమించాలని కోరారు.
తెరాస ఎంపీ కేశవరావు చర్చల ప్రతిపాదనను.. ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు స్వాగతించారు. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే..... ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమేనని స్పష్టం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన ఐకాస నేతలు... ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలను వివరించారు.