'రాష్ట్రాల హక్కులను హరించేలా కొత్త వ్యవసాయ చట్టం' రాజ్యసభలో కొత్త వ్యవసాయ బిల్లును తెరాస ఎంపీలు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఎంపీ కె.కేశవరావు పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.
"రాష్ట్రాల హక్కులను హరించేలా కొత్త వ్యవసాయ చట్టం ఉంది. ఈ కొత్త చట్టం రైతులకు అండగా నిలిచేలా లేదు. వ్యవసాయంలో కూడా కార్పొరేట్లను పెంచేలా ఈ కొత్త చట్టం ఉంది. రైతులకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రతి 5 వేల ఎకరాలకు చొప్పున వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు చేశాం. ఒక్కో క్లస్టర్‌లో 1.65 లక్షల మంది రైతులు ఉన్నారు. కేంద్రం ఏ పథకానికి సరిగా నిధులు ఇవ్వడం లేదు.
రాష్ట్రంలో 191 మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయి. మార్కెటింగ్ ఏజెంట్లకు కూడా నష్టం చేసేలా కొత్త చట్టం ఉంది. వ్యవసాయం, సంబంధిత అంశాలు ఎప్పుడూ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి. రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటోంది. రైతులకు ఇబ్బంది లేకుండా లాక్‌డౌన్ కాలంలోనూ పంటలు కొనుగోలు చేశాం. తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు ఇస్తూ రైతులకు అండగా ఉంటోంది. సమాఖ్య వ్యవస్థకు కూడా ఈ బిల్లు వ్యతిరేకంగా ఉంది. కరోనా కాలంలో కూడా జీడీపీని నిలబెట్టింది వ్యవసాయరంగం మాత్రమే. వ్యవసాయ రంగంలో సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోంది."
- తెరాస ఎంపీ కేశవరావు
ఇదీ చూడండి :రాష్ట్రంలో కొత్తగా 2137 కరోనా కేసులు, 8 మరణాలు