తెలంగాణ

telangana

గులాబీ వ్యూహాలు... గ్రేటర్​లో విజయానికి సరికొత్త అస్త్రాలు

ఎన్నికలకు సమయం తక్కువున్నా... శతకం బాదాల్సిందే! ప్రత్యర్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిత్తుచేయాల్సిందే! నగర అభివృద్ధే ప్రధాన అస్త్రం... అంచనాలకందని వ్యూహాలే విజయ సోపానాలు. ఇలా.. రెండో సారి గ్రేటర్‌పై జెండా ఎగరవేయటమే లక్ష్యంగా గులాబీ దళం దూసుకెళ్తోంది. ముందస్తు ప్రణాళికలు, సమష్టి కృషితో గతంలో కంటే ఎక్కువ బలంతో బల్దియాను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది.

By

Published : Nov 19, 2020, 9:19 PM IST

Published : Nov 19, 2020, 9:19 PM IST

trs moving forward with the plan in ghmc elections
గ్రేటర్​లో పోరులో దూసుకెళ్తోతున్న గులాబీ దళం

వంద స్థానాలను దక్కించుకోవటమే లక్ష్యం....అభివృద్దిపై అడుగడుగునా ప్రచారమే ఆయుధం....ఎత్తుకుపైఎత్తులతో ప్రత్యర్థులను చిత్తుచేసే వ్యూహం.... ఇలా... అంచెనాలకందని అస్త్రశస్త్రాలతో బల్దియాపై మరోసారి జెండా ఎగరవేసేందుకు గులాబీ దళం సిద్ధమైంది. గ్రేటర్‌ నగారాకు నెలల ముందే కదనరంగానికి శ్రేణులను సిద్ధం చేసింది. ఊహించని విధంగా దూసుకువచ్చిన మహాపోరుకు విపక్షాలకంటే ముందుగానే సన్నద్ధమై... కదనరంగానికి సిద్ధమైంది..

పక్కా ప్రణాళికలతో ముందుకు

జీహెచ్‌ఎంసీ పీఠాన్ని మరోమారు కైవసం చేసుకునేందుకు తెరాస పక్కా ప్రణాళికలతో సాగుతోంది. కొన్ని నెలల ముందునుంచే ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు ఎన్నికల సన్నాహాకాలతో కారు జోరును పెంచింది. గత ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందించిన పార్టీ కార్యనిర్వాహక అధ‌్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ మళ్లీ గెలుపు బాధ్యతలను భుజాలకెత్తుకున్నాడు.

ఇందులో భాగంగానే.. గ్రేటర్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన.. ఇటీవల పలు కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో నగర అభివృద్ధిపై తనదైన ముద్రవేశారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్​ నాయకత్వంలో బాధితులను ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు, వరద సాయం అందజేతలాంటి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, ఆస్తిపన్నులో రాయితీతో పాటు పారిశుద్ద్య సిబ్బందికి వేతనాల పెంపులాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులను, నాయకుల్ని ముందు నుంచే బల్దియా పోరుకు సిద్ధం చేశారు.

సిట్టింగ్‌లనే బరిలోకి దించిన అధికార పార్టీ

శాసనసభ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం మాదిరిగానే దాదాపు సిట్టింగ్‌లనే బరిలోకి దించిన అధికార పార్టీ.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించింది. హైదరాబాద్‌లో పాగా వేయడమే లక్ష్యంగా పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతోంది. విపక్షాలకు అందనంత వేగంగా తక్కువ సమయంలోనే విజయఢంకా మోగించేలా దూసుకుపోతోంది. సిట్టింగ్‌ల విషయంలో పలువురి విషయంలో ముందే అప్రమత్తమైన పార్టీ అధిష్ఠానం... వారిని మందలించి తీరు మార్చుకోవాలని హెచ్చరించింది. గతంలో ఓడిపోయిన స్థానాలతో పాటు సిట్టింగ్‌లకు ఇవ్వని ఒకట్రెండు చోట్ల అభ్యర్థుల కోసం తీవ్ర కసరత్తులు చేసింది. ఆయా డివిజన్లలో అంతర్గత సర్వేలు జరిపించి.. బలమైన అభ్యర్థుల జాబితానూ సిద్ధం చేసింది.

శ్రేణులకు దిశానిర్దేశం

ప్రచారం విషయంలోనూ గులాబీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిన అధిష్ఠానం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెరాస లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యులకు డివిజన్‌ ఇంచార్జిల బాధ్యతలను అప్పగించారు. రాష్ట్రం ఆవిర్భావ అనంతరం హైదరాబాద్‌ను 67 వేల కోట్ల రూపాయలతో తెరాస ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... నగరం సాధించిన పురోగతి, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాల జాబితాను తయారు చేసి నేతలకు అందజేశారు. ఈ మేరకు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్‌లు పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించేలా దిశానిర్దేశం చేశారు. వీటితో పాటు వరదల వేళ ప్రభుత్వ చేపట్టిన చర్యలు, కరోనా కట్టడికి తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధినేత శ్రేణులకు తేల్చి చెప్పారు.

భాజపానే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు

దుబ్బాక ఉపఎన్నికలో ఊహించని ఓటమితో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న తెరాస.. జీహెచ్​ఎంసీలో విజయం సాధించాలని భావిస్తోంది. ఉపఎన్నికలో గెలిచి ఉత్సాహంతో ఉన్న కమలదళాన్ని నిలువరించాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో మొదటి నుంచి కాంగ్రెస్‌ కాకుండా భాజపానే లక్ష్యంగా భావిస్తూ... తెరాస విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.

ఈ క్రమంలోనే ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికిచ్చిన నిధులు, వరదలొస్తే వ్యవహరించిన తీరు, మతప్రతిపాదికన భాజపా రాజకీయాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుంటోంది. పార్టీ ముఖ్యులతో సమావేశంలోనూ అధినేత కేసీఆర్‌.. పెట్టుబడులతో హైదరాబాద్‌ అభివృద్ధి, ఉపాధి కావాలా లేక మతం పేరిట రెచ్చగొట్టే నగరం కావాలో.. గ్రేటర్‌ వాసులు ముందు చర్చ పెట్టాలని నేతలకు సూచించారు. గతంలో కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది తెరాస. అలాగే, ఊహించని విధంగా దెబ్బకొట్టిన కమలం పార్టీకి కళ్లెం వేయడానికి బల్దియా ఎన్నికలు సరైన వేదికగా అధికార పార్టీ భావిస్తోంది.

ఇదీ చదవండి:గ్రేటర్​లో ప్రచార అనుమతికి 'ఏకగవాక్ష' పద్ధతి

ABOUT THE AUTHOR

...view details