Kavitha Tweet: ఏపీ విభజనపై రాజ్యసభ వేదికగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణలో ఇంకా రాజకీయ వేడిని రగులుస్తూనే ఉన్నాయి. రోజు ఎవరో ఒకరు.. ఏదో రూపంలో ప్రధాని వ్యాఖ్యలపై స్పందిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తే.. తెరాస నేతలు ఎందుకు స్పందిస్తున్నారంటూ... ప్రధాని వ్యాఖ్యలను భాజపా సమర్థిస్తుండగా.. కాంగ్రెస్, తెరాస మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ.. తెరాస మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ తీవ్ర నిరసనలు సైతం చేసింది. కాంగ్రెస్ సైతం ఆందోళనలు చేపట్టింది.
తాజాగా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌ను ఖండిస్తూ కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎవరి భిక్షా కాదని స్పష్టం చేశారు. తెరాస నాయకత్వంలో.. ప్రజలు పోరాడి సాధించుకున్నారన్నారు. కేసీఆర్ నేతృత్వంలో జరిగిన పోరాటంలో చివరికి సత్యమే గెలిచిందన్నారు.
మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని భాజపా అవమానిస్తే.. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ మద్దతుగా నిలబడ్డారని కవిత పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై.. భాజపా వ్యాఖ్యలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ వెనకబడినప్పుడు.. కేసీఆర్ అండగా నిలిచారన్నారు. రాజకీయాల్లో హుందాతనం కోసం కేసీఆరే తొలుత స్పందించారని.. కవిత స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని మాణిక్కం ఠాగూర్‌ను కవిత సూచించారు.