TRS MLAs Purchase High court orders: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో నిందితులు 24 గంటల వరకు నగరాన్ని విడిచి వెళ్లరాదంటూ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. నిందితులైన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, కోరె నందు కుమార్ అలియాస్ నందు, డీపీఎస్‌కేవీఎన్ సింహయాజిలు తమ నివాస చిరునామాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు అందజేయాలని సూచించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన రోహిత్‌రెడ్డిని సంప్రదించడం గానీ, సాక్షులను ప్రభావితం చేయడానికిగానీ వారు ప్రయత్నించరాదని షరతు విధించింది. రిమాండ్‌ను తిరస్కరించడంపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో నిందితులకు నోటీసులు జారీచేస్తూ, విచారణను శనివారానికి వాయిదా వేసింది. భోజన విరామ సమయంలో అత్యవసర విచారణ కోరుతూ పోలీసులు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సాయంత్రం జస్టిస్ చిల్లకూరు సుమలత విచారణ చేపట్టగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపించారు.
ఎమ్మెల్యేలను నిందితులు ప్రలోభపెట్టారనడానికి తగిన సాక్ష్యాధారాలున్నప్పటికీ కింది కోర్టు రిమాండ్‌కు తిరస్కరించడం సరికాదన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర అని, నిందితులు దేశం వదిలి పారిపోయే అవకాశాలున్నాయన్నారు. కేసు పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సీఆర్‌పీసీ సెక్షన్ 41ఎ నోటీసు ఇవ్వలేదనే కారణంతో రిమాండ్ తిరస్కరించడం సరికాదన్నారు. సీఆర్‌పీసీ 41బి ప్రకారం దర్యాప్తు అధికారి సంతృప్తి చెందితే అరెస్టు చేసే అధికారం ఉందన్నారు. కింది కోర్టు ముందు లొంగిపోయేలా నిందితులను ఆదేశించాలని, కింది కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. నిందితుల తరపున వాదనలు వినిపించడానికి గడువు కావాలని సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ కోరడంతో న్యాయమూర్తి విచారణను శనివారానికి వాయిదా వేశారు.