పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే ఇంద్రవెల్లి సభ (Indravelli Sabha)ను పెట్టుకున్నారని తెరాస ఎమ్మెల్యేలు (Trs Mla's) చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌పై రేవంత్ వాడిన భాషకు కాంగ్రెస్ నేతలే సిగ్గు పడుతున్నారని... ప్రజలు తగిన శాస్తి చేస్తారన్నారు. ఎంపీగా గౌరవ భాష మాట్లాడాలన్నారు. దళితులను చిన్నచూపు చూసే రేవంత్‌ను తెలంగాణ సమాజం సహించదన్నారు.
దళిత, బీసీ, మైనారిటీలకు అమలవుతున్న కార్యక్రమాలను రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారని తెరాస ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దళిత బంధు పథకమంటే రేవంత్ రెడ్డికి కడుపు మంట ఎందుకన్నారన్నారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే గురుకులాలకు సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు
చీకటి ఒప్పందం...
భాజపాతో చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి సభ నిర్వహించిందని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రేవంత్ రెడ్డి రెండు సార్లు భాజపా ఎంపీని కలిశారన్నారు. కాంగ్రెస్, భాజపాలకు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. గిరిజనుల సంస్కృతి, పండగలను ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ... దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతోందని జోగు రామన్న విమర్శించారు.