Balka Suman on Rahul: విద్యార్థులకు అంతరాయం కలిగించడం పద్ధతి కాదన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్. యూనివర్సిటీలో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదని ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గతేడాది జూన్‌లోనే నిర్ణయం తీసుకుందని తెలిపారు. మరోవైపు పరీక్షలు, మే 7న యూనివర్సిటీ ఉద్యోగ సంఘాల ఎన్నికలు కూడా ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత వాతావరణంలో చిచ్చు పెట్టడానికి రావాలనుకుంటున్నారా అని బాల్క సుమన్ ప్రశ్నించారు.
దిల్లీ జేఎన్‌యూలో దళిత, బహుజన, వామపక్ష విద్యార్థులపై భాజపా అల్లరి మూకలు దాడులు చేసినప్పుడు రాహుల్ అక్కడికి ఎందుకు వెళ్లలేదన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చే బదులుగా.. ఉత్తరప్రదేశ్‌లో పార్టీని కాపాడుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం జగ్గారెడ్డి తనపై ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా మాట్లాడితే సహించేది లేదని బాల్క సుమన్ హెచ్చరించారు. శుక్రవారం గడ్కరీ కార్యక్రమంలో తమ మంత్రి ప్రసంగాన్ని భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారని.. తాము అలాగే ప్రవర్తిస్తే రాష్ట్రంలో పర్యటించలేరన్నారు. బండి సంజయ్ యాత్రలో ప్రజలు లేరూ.. సంగ్రామమూ లేదని.. అది పాపాల యాత్ర అని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. ఏడున్నరేళ్లుగా ప్రజల సంక్షేమం కోసం తెరాస సర్కార్ అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిన, ఉచితంగా విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణేనని బాల్క సుమన్ వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో, తెరాస హయాంలో జరిగిన అభివృద్ధిపై రేవంత్ రెడ్డి చర్చకు రావాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ సవాల్ విసిరారు.