ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో మరోసారి తెలంగాణపై విషం చిమ్మారని, రాష్ట్రానికి పైసా ఇవ్వకపోగా ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడారని రాష్ట్ర మంత్రులు, నేతలు విమర్శించారు. ఆయనకు అమరుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గురువారం ప్రధాని పర్యటన ముగిసిన అనంతరం మంత్రి హరీశ్ సిద్దిపేటలోనూ.., మంత్రులు నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డిలు, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు హైదరాబాద్‌లోనూ వేర్వేరుగా ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
‘‘ఇది గుజరాత్ కాదు.. పోరాటాల గడ్డ. చైతన్యవంతమైన తెలంగాణలో గుజరాత్ మాదిరి ప్రజలు మోసపోరు. తెలంగాణవాసుల ఆశీర్వాదంతో గెలిచిన తెరాసపై ప్రధాని మోదీ.. కుటుంబ పార్టీగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కడుపునిండా విషంతో అక్కసు వెళ్లగక్కుతున్నారు. కేసీఆర్ నమ్మకానికి, మోదీ అమ్మకానికి మారుపేరు. నాడు తెలంగాణ రాకుండా కొందరు కాంగ్రెస్ నేతలు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయబోగా.. నేడు భాజపా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన బీఆర్‌జీఎఫ్ నిధులు రూ.1500 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.6 వేల కోట్లు ఇవ్వలేదు. రాష్ట్ర విభజన కింద రావాల్సిన రూ.1500 కోట్లదీ అదే తీరు. కుటుంబ రాజకీయాలంటూ మోదీ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అమిత్‌షా కుమారుడు బీసీసీఐ కార్యదర్శిగా, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరరాజే కుమారుడు దుష్యంత్‌సింగ్ ఎంపీగా.., పీయూష్‌గోయల్ తండ్రి రాజకీయాల్లో ఉన్నారు కదా.. అభివృద్ధిలో గుజరాత్‌ను తెలంగాణ మించిపోతుందని, నిధులు ఇవ్వకుండా, అనుమతులు రాకుండా అడ్డుపడుతున్నారు’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
కేంద్రంలో మాటలే తప్ప చేతలేవీ