Mallareddy Reaction on IT Raids : ఐటీ దాడులపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. 2008లోనూ తమ ఇంట్లో తనిఖీలు చేశారని తెలిపారు. అప్పుడు సీజ్ చేసిన బంగారం ఇప్పటి వరకూ ఇవ్వలేదని చెప్పారు. తామేం తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఐటీ దాడులు సహజమేనన్న మంత్రి ఈసారి అధికారులు వ్యవహరించిన తీరు మాత్రం బాధకరమన్నారు.
ఐటీ, ఈడీ, సీబీఐ.. దేన్నైనా ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ రెడీ : మల్లారెడ్డి
Mallareddy Reaction on IT Raids : తనపై, తన కుటుంబం, బంధువులపై జరిగిన ఐటీ దాడులపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఇంతకుముందు కూడా తనపై ఐటీ సోదాలు జరిగాయని.. కానీ ఈసారి అధికారులు వ్యవహరించిన తీరు తనని ఆశ్చర్యపరించందని అన్నారు. ఎవరో చెప్పిన పనిని త్వరగా చేసేసేయాలన్న తొందరపాటు కనిపించిందని.. ఈ క్రమంలో వారు వ్యవహరించిన తీరు చాలా బాధాకరంగా ఉందని ఆవేదన చెందారు.
"నా కుమారుడు ఆసుపత్రిలో ఉన్న విషయం తనిఖీలకు వచ్చిన అధికారులు చెప్పలేదు. కనీసం ఫోన్ చేసిన మాట్లాడించలేదు. నా కుమారుడు ఆసుపత్రిలో ఉన్నట్లు టీవీలో చూసి తెలుసుకున్నాను. సమాచారం టీవీలో చూసి నా భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. నా భార్య బాధ చూసి నాకు కూడా కన్నీరు వచ్చింది. కుమారుడిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లనీయకపోవడంతో కోపం వచ్చింది." అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
Mallareddy comments on IT Raids : ఇప్పుడు జరుగుతున్న దాడుల ప్రక్రియ ఇంకా 3 నెలలు కొనసాగుతుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరిగే అవకాశముందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఏదైనా ఎదుర్కొనేందుకు కేసీఆర్ టీమ్ రెడీగా ఉందని చెప్పారు. ఎవరేం చేసినా.. ఎన్ని కుట్రలు పన్నినా భవిష్యత్‌లో అధికారం బీఆర్ఎస్‌దేనని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.