TRS Leaders Protest: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెరాస శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముషీరాబాద్, కూకట్‌పల్లిలోని పలుచోట్ల భాజపాకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగిలో తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
కమలం పార్టీ ఎత్తులు రాష్ట్రంలో సాగబోవు: నల్గొండలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో రాస్తారోకో చేశారు. కరీంనగర్‌లో తెరాస శ్రేణులు నిరసన చేపట్టారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంతో పాటు హుస్నాబాద్‌లో గులాబీ పార్టీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు. మెదక్ రాందాస్ చౌరస్తాలో తెరాస కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మంచిర్యాలలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నేతలు.. కమలం పార్టీ ఎత్తులు రాష్ట్రంలో సాగబోవని హెచ్చరించారు.
నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంతో పాటు బాల్కొండలో రాస్తారోకో నిర్వహించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై నిరసనకారులు బైఠాయించారు. హనుమకొండలో, పరకాలలో ఆందోళనలు కొనసాగాయి. ఖమ్మంలో గులాబీ పార్టీ నేతలు భారీ ప్రదర్శన నిర్వహించారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఆందోళనకు దిగారు. నిర్మల్‌లోని జయశంకర్ సర్కిల్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తెరాస శ్రేణులు నినాదాలు చేశారు.
తెరాసకు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టిన కమలదళం: అటు తెరాసకు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టిన కమలదళం.. ఉపఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారంటూ ఎదురుదాడి చేసింది. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయం వద్ద పలువురు కార్యకర్తలు నిరసనకు దిగారు. కర్మన్‌ఘాట్ కూడలిలో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని షాపూర్‌నగర్ చౌరస్తాలో ఆందోళన చేసే క్రమంలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచోసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్‌లో భాజపా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.