తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS Protest Over Paddy Procurement: కేంద్రం తీరుపై భగ్గుమన్న తెరాస.. ఊరూరా చావు డప్పులతో ఆందోళనలు - తెలంగాణ వార్తలు

TRS Protest Over Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరిపై నిరసనగా సీఎం కేసీఆర్ పిలుపుతో... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో తెరాస శ్రేణులు హోరెత్తించారు. ఊరూరా చావు డప్పులు మోగిస్తూ ఆందోళన చేపట్టారు. గ్రామగ్రామానా ర్యాలీలతో నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

TRS Protest Over Paddy Procurement, strike against central government
తెరాస ఆందోళనలు, రాష్ట్రవ్యాప్తంగా తెరాస నిరసనలు

By

Published : Dec 20, 2021, 12:59 PM IST

Updated : Dec 20, 2021, 4:42 PM IST

TRS Protest Over Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో నిరసనలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వం, భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. పలుచోట్ల ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

చావు డప్పులతో ఊరూరా ర్యాలీ

నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన..

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వైఖరికి నిరసనగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్ ఆధ్వర్యంలో గండిమైసమ్మలోని తెలంగాణ భవన్ నుంచి సిగ్నల్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి చావు డప్పుతో ర్యాలీ చేపట్టారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భాజపా నీచ రాజకీయాలకు పాల్పడుతోందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతుంటే... మరోవైపు భాజపా రాష్ట్ర నాయకులు కొంటామని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. శేరిలింగంపల్లి చందానగర్ డివిజన్ నిరసన కార్యక్రమం చేపట్టారు. తెరాస నాయకులు రఘునాథరెడ్డి, మిర్యాల రాఘవరావు, రఘుపతి రెడ్డి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ, స్థానిక కార్పొరేటర్లు, తెరాస శ్రేణులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ రహదారిపై ధర్నా చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు 65వ నంబరు జాతీయ రహదారిపై తెరాస శ్రేణుల రాస్తారోకో నిర్వహించారు. రైతుల కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి... యావత్ తెలంగాణ ప్రజలు మద్దతు తెలుపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, వివిధ మండలాల తెరాస శ్రేణులు పాల్గొన్నారు.

ధాన్యం బస్తా తలపై మోస్తూ నిరసన

'రైతులను ఆగం చేస్తున్న భాజపా'

కేంద్రం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ హనుమకొండ జిల్లా కేంద్రంలో తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ నేతృత్వంలో కాజీపేటలో కడిపికొండ బ్రిడ్జి నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ రైతులను బాగు చేస్తుంటే... కేంద్రంలో ఉన్న భాజపా రైతులను ఆగం చేస్తోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం వైఖరి మారాలని... లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో తెరాస పార్టీ శ్రేణులు, రైతులు ఆందోళన చేపట్టారు. తెరాస ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తుంటే... కేంద్రం ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు పెట్టడం బాధాకరమని అన్నారు. ఊరువాడలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడతామని స్పష్టం చేశారు.

ఊరూరా చావు డప్పు కార్యక్రమం

కేంద్రంపై ఫైర్

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, భువనగిరి, చౌటుప్పల్​లో తెరాస శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెరాస నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో భాజపా రాష్ట్ర నాయకులు, కేంద్ర సర్కారు భిన్నరకాలుగా మాట్లాడుతున్నాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. యాసంగిలో రైతులు వరి పంట సాగుచేస్తే... కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే అన్నదాతలు నష్టపోతారని అన్నారు. తమ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నారని... సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కేంద్రం వైఖరికి నిరసనగా చావు డప్పు

'కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదు..'

ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలో తెరాస రైతు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అన్ని వీధుల మీదుగా నిరసన ర్యాలీ సాగింది. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని నేతలు ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెరాస నేతలు పాల్గొన్నారు.

బాల్కొండలో నిరసనలు

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో తెరాస ఆధ్వర్యంలో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. తెరాస కార్యాలయం నుంచి ర్యాలీ చేశారు. వన్నెల్‌(బి) కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రంలో పండిన ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తూ... చివరి గింజ వరకు మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. మండలంలోని గ్రామాల్లో సైతం రైతులతో కలిసిఆందోళనలు నిర్వహించారు. కేంద్రమే ధాన్యం కొనుగోళ్లు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ చేశారు. వేల్పూర్‌, మోర్తాడ్‌, ముప్కాల్‌, మెండోరా, కమ్మర్‌పల్లి, భీమ్‌గల్‌, ఏర్గట్ల మండలాల్లో సైతం ఆందోళనలు చేపట్టారు.

తెరాస ఆందోళనలు, రాష్ట్రవ్యాప్తంగా తెరాస నిరసనలు

జమ్మికుంటలో తెరాస రైతు నిరసన

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు ఈ నిరసన చేపడుతున్నట్లు తెరాస నాయకులు సమ్మిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే... మరో వైపు రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. జమ్మికుంట గాంధీ చౌక్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెరాస నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా... భాజపా శ్రేణులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు భాజపా శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట పట్టణం విక్టరీ టాకీస్ చౌరస్తాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా తెరాస రాస్తారోకో చేపట్టింది. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఆందోళన చేస్తుండగా తెరాస నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

'కేంద్రం వైఖరి మార్చుకోవాలి..'

భాజపా సిద్ధాంతం లేని పార్టీ అని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలోని తెరాస కార్యాలయం నుంచి పాత బస్​స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం తమ వైఖరిని మార్చుకుని... రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు 24 గంటల నీరు అందిస్తే... కేంద్రం మాత్రం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల్లో తెరాస నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలో అంబేడ్కర్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో తెరాస నాయకులు నల్ల బ్యాడ్జిలను ధరించి.. నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు. అనంతరం రైతుల సంతకాల సేకరణ చేపట్టారు. రైతుల పట్ల భాజపా వైఖరి మార్చుకోవాలంటూ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమన్ని చేపట్టారు. మండలంలోని రైతులతో కలిసి చావు డప్పుతో ర్యాలీ చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి పల్లెకు సాగునీరు అందుతోందని... ఇలాంటి పరిస్థితుల్లో వరి తప్ప ఇతర పంటలు పండే పరిస్థితి లేదన్నారు. పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. మంథని నియోజకవర్గ వ్యాప్తంగా డప్పు చప్పుళ్లతో ర్యాలీలు నిర్వహించారు. మంథని పట్టణంలోని అంబేడ్కర్ ప్రధాన చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా తెరాస శ్రేణులు బైఠాయించాయి. రామగిరి, కమాన్పూర్, ముత్తారం, మల్హర్, కాటారం మండల కేంద్రాలలో ఆందోళనలు చేశాయి.


ఇదీ చదవండి:TRS Protest Over Paddy Procurement : 'తెలంగాణ రైతు గోస దిల్లీకి వినిపిస్తాం'

Last Updated : Dec 20, 2021, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details