Trs leader cheated woman: ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తనను వదిలేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ బాధిత మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన తెరాస నేత, మాజీ ఎంపీటీసీ ముక్కముల దుర్గయ్య తన మొదటి భార్య చనిపోయిందని చెప్పి.. 2018లో విజయను రెండో వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు ఆమెను వేరే ఊరిలో కాపురం ఉంచాడు.
ఆ తర్వాత విజయ గర్భవతి అని తెలియడంతో దుర్గయ్య ఆమెకు టెస్ట్లు చేయించాడు. పరీక్షలో ఆడపిల్ల అని నిర్ధారణ కావడంతో రెండుసార్లు అబార్షన్ చేయించాడు. ఈ విషయంపై ఆమె నిలదీయడంతో తన మొదటి భార్య బతికే ఉందని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. కొడుకు కోసమే రెండో పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. దీంతో విజయ అతడిపై 2020లో రామన్నపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును వెనక్కు తీసుకోమని దుర్గయ్య విజయను కోరాడు. మరలా కలిసి ఉందామని ఆమెను నమ్మించాడు.
ఈ క్రమంలో విజయ మరోసారి గర్భవతి అయింది. ఫిబ్రవరిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి దుర్గయ్య ఆమెను పట్టించుకోలేదు. ఈ క్రమంలో న్యాయం కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించిన వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే హెచ్ఆర్సీని ఆశ్రయించానని విజయ వాపోయింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మంత్రి జగదీశ్వర్ రెడ్డి అండదండలు తనకు ఉన్నాయని ఎవ్వరూ ఏమీ చేయలేరని బెదిరిస్తున్నాడని ఆమె చెప్పింది. ఇప్పటికైనా తనకు, తన పాపకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజయ కమిషన్ను కోరింది.