Trs Operation Akarsh: అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్ని సెమీ ఫైనల్‌గా భావిస్తుడటంతో సత్తా చాటేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డు స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆయారాం గయారాంలతో.. రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మునుగోడు పోలింగ్ సమయందగ్గర పడుతుండటంతో గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరంచేసింది. ఘర్‌వాపసీ అంటూ గతంలో పార్టీని వీడిన నేతల్నిఆహ్వానించి కండువా కప్పేస్తోంది.
తనదైన వ్యూహాల అమలు: భారాసగా మారుతున్న తెరాస జాతీయ రాజకీయాలు, మునుగోడు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తనదైన వ్యూహాలను అమలు చేస్తోంది. కాంగ్రెస్‌లో చేరిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో ఆపరేషన్ మొదలుపెట్టింది. ఓదెలు దంపతులను పార్టీలోకి ఆహ్వానించి సీఎం కేసీఆర్ గులాబీ కండువాకప్పారు. చేరికలపై ఆచితూచి వ్యవహరించిన గులాబీ పార్టీ.. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ భాజపాలో చేరడంతో వేగం పెంచింది.
ఆ వర్గం వారంతా తమవైపే:తెరాసలో బీసీలకు అవమానం జరుగుతోందన్న బూర నర్సయ్య వ్యాఖ్యలను తిప్పికొట్టేలా ముందుకెళ్తోంది. బీసీ నాయకులపై తొలుత దృష్టిపెట్టిన తెరాస ఆ వర్గం వారంతా తమవైపే ఉన్నారనే సంకేతమిచ్చేలా చర్యలు చేపట్టింది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించిన పల్లె రవికుమార్‌గౌడ్ దంపతుల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఒకరుపోతే నలుగురువస్తారనే సంకేతం ఇచ్చేలా దూకుడు పెంచింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ భాజపాకు రాజీనామా చేసి తెరాసలో చేరారు.
మరికొందరు నేతల పేర్లు ప్రచారం: శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, భాజపాలో ఉన్న దాసోజు శ్రవణ్‌కి ఒకేరోజు ఒకేవేదికపై గులాబీ కండువా కప్పేశారు. వారిద్దరు ఉద్యమ సమయంలో తెరాసలో కీలక పాత్ర పోషించిన నాయకులే. తెరాసలో బీసీలు, గతంలో బయటకు వెళ్లిన నేతల చేరికలు ఊపందుకోవడంతో మరికొందరు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. జితేందర్‌రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, తులఉమ, కూన శ్రీశైలం గౌడ్ తదితరుల భాజపా నాయకులు తెరాసలో చేరతారని సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వచ్చాయి.