అసైన్డ్ భూములను కబ్జా చేసినట్లు మంత్రి ఈటలపై వచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి.. శనివారం వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించాలంటూ గవర్నర్ తమిళిసైకు సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి అధికారిక సమాచారం పంపారు. ఈటలను వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించిన వెంటనే ఆ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. తన కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు. మంత్రిత్వ శాఖ నుంచి ఈటలను తప్పించడం అత్యంత వేగంగా జరిగింది. అసైన్డ్ భూముల కబ్జా వ్యవహారానికి సంబంధించి శనివారం ఉదయమే మెదక్ జిల్లా కలెక్టర్, విజిలెన్స్ డైరెక్టర్ జనరల్‌లు వేర్వేరుగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వీరి నుంచి తక్షణ నివేదిక అందినట్లు సమాచారం. తెరాస రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఫిబ్రవరిలో మంత్రివర్గాన్ని విస్తరించినపుడు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటలను నియమించారు. సుమారు రెండేళ్ల రెండు నెలలు ఆయన ఈ శాఖ బాధ్యతలు నిర్వహించారు.
ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం?
ఈటల రాజేందర్‌ను త్వరలో మంత్రివర్గం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిన్న ఆయన నుంచి వైద్య, ఆరోగ్య శాఖను ప్రభుత్వం తప్పించింది. ఆ శాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఈటల శాఖ లేని మంత్రిగా మిగిలారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే బర్తరఫ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. లేదా త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని.. ఆ సమయంలో ఈటలను పక్కన పెట్టవచ్చని భావిస్తున్నారు.
కొత్త మంత్రి ఎవరో..
కరోనా రెండో దశ ఉద్ధృతితో పాటు ప్రస్తుత పరిస్థితులలో వైద్య ఆరోగ్య శాఖ కీలకంగా మారింది. ఈ శాఖను ముఖ్యమంత్రి వద్దే ఉంచుకుంటారా, ఎవరికైనా అప్పగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెరాస ఉన్నతస్థాయి వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఆదివారం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితం, సోమవారం నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. వీటన్నింటిలో తెరాసకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున.. వెంటనే మంత్రివర్గంలో మార్పులు చేపట్టవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆరోపణలున్న ఇతర మంత్రుల విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సామాజిక సమీకరణలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మార్పులు చేసే అవకాశం ఉంది. తెరాస రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ బాధ్యతలు చేపట్టిన అప్పటి ఉప ముఖ్యమంత్రి రాజయ్యను ఆరోపణల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇప్పుడు అదే శాఖ మంత్రి రాజేందర్‌ను బాధ్యతల నుంచి తప్పించటం గమనార్హం.
ఇదీ చూడండి: ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించేలా సర్కారు అడుగులు