జిల్లాల్లో నాయకుల మధ్య ఉన్న విభేదాలపై తెరాస అధిష్ఠానం దృష్టి సారించింది. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్లుగా ఉండటం, నియోజకవర్గంలో ఇతర బలమైన నాయకులు లేదా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కలుపుకెళ్లకపోవడం వంటి వాటిని గమనించింది. పలు మార్లు సర్దిచెప్పినా పంథా మారని నేతల విషయంలో నాయకత్వం కొంత గట్టిగా వ్యవహరించే అవకాశం కూడా కనిపిస్తోంది. అక్కడక్కడా ఉన్న ఇలాంటి సమస్యలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపకూడదని చర్యలకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై నాయకత్వం దృష్టి సారించింది.
ఎమ్మెల్యేలపై అసంతృప్తి, నాయకుల మధ్య విభేదాలు, కలహాలు తదితర అంశాలపై ఆరా తీస్తోన్న అధిష్ఠానం సామరస్య వాతావరణాన్ని నెలకొల్పేందుకు గట్టి ప్రయత్నాలు చేపట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండతో సహా మరో రెండు మూడు జిల్లాల్లో ఉన్న కొన్ని సమస్యలపై ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలిసింది. నాడు ఖమ్మం జిల్లాలో నాయకుల మధ్య ఉన్న విభేదాలు గత ఎన్నికల్లో ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పార్టీలో నాయకుల మధ్య ఐక్యత గురించి గట్టిగా నొక్కి చెప్పారు. ప్రశాంత్‌కిషోర్ సర్వే ఆధారంగా ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చెప్పారు. దీంతోపాటు వైరా, పాలేరు తదితర నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాలేరు నియోజకవర్గంలో జరిగే పార్టీ సమావేశాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా భాగస్వామిని చేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డికి సూచించినట్లు తెలిసింది. జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాలలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని భాగస్వామిని చేయాలని నేతలకు చెప్పారని సమాచారం. ఉమ్మడి జిల్లాల వారీగా పరిస్థితులు ఇలా...
వరంగల్‌లో ఎడమొఖం.. పెడమొఖం:వరంగల్ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి పనిచేయడం లేదనే అభిప్రాయం ఉంది. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లకు మధ్య మాటల్లేవు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, మాజీ ఉపముఖ్యమంత్రి- ఎమ్మెల్సీ కడియం శ్రీహరిలకు పొసగడం లేదు.వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కీలక నేతల మధ్య విభేదాలున్నాయి.
కరీంనగర్ జిల్లాలో ఎవరికి వారే :కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీపరంగా కలిసి పనిచేయాలనే భావన ఎమ్మెల్యేల్లో కరవైందని పార్టీ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే సొంత పార్టీ సర్పంచులపైనే కన్నెర్ర చేయడంతో వారంతా మంత్రులను, ఇతర ముఖ్యనేతలను కలిసి కాపాడాలని మొరపెట్టుకుంటున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో తెరాస ముఖ్యనేతలకు పదవులిచ్చారు. వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
ఆదిలాబాద్‌లో అయిదు చోట్ల కుతకుత:ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాపురావుకు, పార్టీ ముఖ్యనేతలకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఖానాపూర్‌లో శాసనసభ్యురాలు రేఖానాయక్‌కు, జడ్పీ ఛైర్మన్‌కు మధ్య కలహాలు సాగుతున్నాయి. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్నకు పురపాలక మాజీ ఛైర్‌పర్సన్ వర్గం వ్యతిరేకంగా ఉంది. చెన్నూరులో బాల్కసుమన్‌పై అసంతృప్తితో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌లు కాంగ్రెస్‌లో చేరడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కుపై జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కోవాలక్ష్మి అసమ్మతిని వ్యక్తంచేస్తున్నారు.