TRS Executive Meeting: భాజపా నిజ స్వరూపాన్ని తెలంగాణ బయటపెట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేయాలని భాజపా చూసిందని... ఆ కుట్రలకు సంబంధించి సుమారు 5లక్షల పేజీల సమాచారం ఉందన్నారు. భాజపాను ఎట్టిపరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని కేసీఆర్ పేర్కొన్నారు. భాజపా వద్ద 2 లక్షల కోట్ల రూపాయలున్నాయని సింహయాజీ అన్నారని... ఒక రాజకీయ పార్టీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. ఎనిమిదేళ్లుగా ఈడీ ఎన్నో కేసులు పెట్టినప్పటికీ.. ఒక్కటి కూడా రుజువు కాలేదన్నారు.
ఎమ్మెల్యేలపై కూడా ఈడీ దాడులు జరగొచ్చునని... భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. ధర్మంగా, న్యాయంగా పోరాడుతున్నామని.. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో చట్టం తన పని తాను చేస్తోందని.. త్వరలో మరిన్ని అరెస్టులు జరగొచ్చునని కేసీఆర్ వ్యాఖ్యానించారు. భాజపా గూండాగిరి, దాదాగిరి చేస్తోందని.. మునుగోడు ఎన్నికల్లో ఆ పార్టీ ప్రసాదాలు పంచిందా అని ఎద్దేవా చేశారు. భాజపా వికృత రాజకీయ చేష్టలకు తెలంగాణ నుంచే చరమగీతం పలకాలన్నారు.
కవితను పార్టీలో చేరమని భాజపా అడిగింది.. దేశానికి భాజపా రూపంలో పట్టిన చెదలును తొలగించే బాధ్యతను తెరాస శ్రేణులు తీసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ తనలా పని చేయాలని తెరాస నేతలకు కేసీఆర్ సూచించారు. తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీలో చేరమని భాజపా అడిగిందని.. ఇంతకన్నా ఘోరం ఉంటుందా అన్నారు. ఎవరైనా ఫోన్ చేసి పార్టీ మారమని చెబితే చెప్పుతో కొడతామని సమాధానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ది ముగిసిన అధ్యాయమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా ఉండవని.. షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని స్పష్టతనిచ్చారు. తెరాస నేతలు, ప్రజా ప్రతినిధులు వచ్చే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
సిట్టింగులకు మళ్లీ అవకాశం ఇస్తాం.. ఎమ్మెల్యేలను మార్చే ఉద్దేశం లేదని... సిట్టింగులకు మళ్లీ అవకాశం ఇస్తామన్నారు. మునుగోడులో పార్టీ నేతలందరూ సమష్టిగా పనిచేసి విజయం సాధించారని అభినందించారు. మునుగోడు తరహాలోనే పటిష్టమైన ఎన్నికల వ్యూహాలను నియోజకవర్గస్థాయిలో రూపొదించుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు, నేతలందరూ ప్రజల్లోనే ఉండాలన్నారు. పది గ్రామాలకోసారి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ చెప్పారు.