2016 బల్దియా ఎన్నికల్లో తెరాసకు అన్నీ తానై మంత్రి కేటీఆర్ ముందుకు నడిపించారు. 99 డివిజన్లలో గెలిపించగలిగారు. 2020 ఫిబ్రవరిలో ప్రస్తుత బల్దియా పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలూ సమీపిస్తుండటంతో కేటీఆర్ గ్రేటర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొందరి పనితీరు బాగా లేదని సర్వేలో తేలిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెరాస కార్పొరేటర్లలో ఆ 15 శాతం మంది ఎవరో అనే గుబులు! - 2020 జీహెచ్ఎంసీ ఎన్నికలు వార్తలు
గ్రేటర్‌లోని తెరాస కార్పొరేటర్లకు గుబులు పట్టుకుంది. పదిహేను శాతం మంది పనితీరు బాగా లేదంటూ సాక్షాత్తూ మంత్రి కేటీఆర్ హెచ్చరించగా ప్రతి ఒక్కరిలోనూ కలవరం మొదలయింది. ఆ జాబితాలో మా పేరు ఉందా? రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందా? అంటూ ఎమ్మెల్యేల దగ్గరికి కొందరు పరుగు పెడుతున్నారు.
ఇటీవల, కారు పార్కింగ్ విషయంలో ఓ కార్పొరేటర్ యువతిపై దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది. మరొకరి కబ్జా రాజకీయం మంత్రి దృష్టికెళ్లినట్లు తెలిసింది. ఫోన్ ఆపేసి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదంటూ మరొకరిపై ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలోనే మంత్రి సర్వే చేయించి ఉంటారని తెరాస నాయకులు అంటున్నారు. నెల రోజులు సమయమిచ్చారని, ఆలోపు మార్పు కన్పిస్తే మేలని చెప్పుకొంటున్నారు. ఒక్కో కార్పొరేటర్ 3 వేల మంది పట్టభద్రులతో ఓటు హక్కుకు దరఖాస్తు చేయించాలని పార్టీ లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిసింది. తమ హయాంలో జరిగిన అభివృద్ధిపై ప్రోగ్రెస్ కార్డును తయారు చేసుకోవాలని సూచించింది.