జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నిన్న భాజపా కార్పొరేటర్లు వ్యవహరించిన తీరును తెరాస ఖండించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్లు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ పరిసరాలను పాలతో శుభ్రం చేస్తూ… నిరనస వ్యక్తం చేశారు.
అనంతరం భాజపా కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని మేయర్ విజయలక్ష్మికి వారు వినతిపత్రం అందజేశారు. ఘటనకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేసి… కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడుతుంటే… భాజపా నాయకులు నగర ఖ్యాతిని అప్రతిష్ఠపాలు చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమన్వయంతో సాగితేనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని… అనసవర వివాదాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు.