హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election 2021)లో భాజపా నేతలు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ (Trs Complaint To Ec) జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని తెరాస నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బుద్ధభవన్‌లో ఎన్నికల ప్రధాన అధికారి డా.శశాంక్ గోయల్ (Ec Shashank Goyal)ను తెరాస నేతలు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కలిసి వినతిపత్రం ఇచ్చి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి చట్టాన్ని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచారాలు చేస్తున్నారని ఈ అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకొచ్చినట్లు వివరించారు.
తెరాస నేతలు డబ్బులు పంచుతున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సింది పోయి.. ఎన్నికల్లో పైసలు తీసుకొని భాజపాకు ఓటు వేయండని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తే స్పందన రాలేదు.. కాబట్టి ఎన్నికల ప్రధానాధికారికి అన్ని ఆధారాలు అందజేసి ఫిర్యాదు చేశామన్నారు.
ఎన్నికల అధికారి షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రశాంతంగా జరిగే ఎన్నికలను హింసాత్మకంగా మార్చి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనే కుట్ర పన్నటం తగదన్నారు. ఈ విషయంలో ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని కోరారు.