TRS on Election Symbols: మునుగోడు ఉప ఎన్నికల్లో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని ఎన్నికల కమిషన్‌ను తెరాస కోరింది. ఈ మేరకు తెరాస నేతలు దాస్యం వినయ్ భాస్కర్, భాను ప్రసాదరావు, భరత్ కుమార్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. గుర్తుల జాబితా నుంచి కెమెరా, చపాతీ రోలర్, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టుమిషన్, ఓడను తొలగించాలని కోరారు. వినతి పత్రంపై 48 గంటల్లో స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తెరాస అభ్యర్థులకు నష్టం జరిగిందని తెరాస నేతలు పేర్కొన్నారు. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా.. ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కారును పోలి ఉన్నందునే వాటికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకి తెరాస నేతలు వివరించారు. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు.
నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ 8 గుర్తులను తొలగించాలని కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కేసీఆర్‌పై క్షుద్రపూజల వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని తెరాస నేతలు డిమాండ్ చేశారు.