నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది..హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి విజయకేతనం ఎగురవేసింది. హైదరాబాద్ స్థానం నుంచి సురభి వాణీదేవి గెలవగా, నల్గొండ స్థానాన్ని పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. అయితే చివరి ఎలిమినేషన్ (తీన్మార్ మల్లన్న) ఓట్లలో పల్లాకు ఎన్ని పడ్డాయో ఆదివారానికి స్పష్టత రానుంది.
నల్గొండలో ఈ ఓట్ల లెక్క ఇంకా కొనసాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మిశ్రమ ఫలితాల అనంతరం... ఈ ఎన్నికల్లో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాన్ని రూపొందించి, కార్యాచరణకు పూనుకొన్నారు. అనుగుణంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం సత్ఫలితాలను ఇచ్చింది.
సిట్టింగు స్థానం కోల్పోయిన భాజపా...
భాజపా హైదరాబాద్ సిట్టింగు స్థానాన్ని కోల్పోయింది. ఆ పార్టీ అభ్యర్థి రెండోస్థానంలో నిలిచారు. నల్గొండ స్థానంలో భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ‘హైదరాబాద్’లో నాలుగో స్థానం, నల్గొండలో అయిదో స్థానంలో నిలిచింది. ‘నల్గొండ’ నుంచి బరిలో నిలిచిన తెజస అధ్యక్షుడు కోదండరాం, హైదరాబాద్ నుంచి పోటీ చేసిన నాగేశ్వర్‌కూ నిరాశ తప్పలేదు.
తెరాస.. భాజపా హోరాహోరీ..
హైదరాబాద్ స్థానంలో తెరాస అభ్యర్థి వాణీదేవి గెలుపొందినట్లు శనివారం రాత్రి రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆల అధికారికంగా ప్రకటించారు. ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం ఆమె విజేతగా నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఓట్లలో రెండో ప్రాధాన్యం కింద భాజపాకు 8,698, స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్‌కు 7,735, తెరాసకు 8,391 ఓట్లు బదిలీ అయ్యాయి. మెజారిటీ ఎవరికీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్ తొలగింపు జరగ్గా.. ఆయన నుంచి తెరాసకు 21,259, భాజపాకు 18,368 ఓట్లు బదిలీ అయ్యాయి. అయినా విజయానికి కావల్సిన 1,68,520 ఓట్లు ఎవరికీ దక్కలేదు.
చివరకు భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు తొలగింపు జరగ్గా.. ఆయన నుంచి తెరాస అభ్యర్థి వాణీదేవికి 40,070 ఓట్లు బదిలీ అయ్యాయి. పోలైన ఓట్లలో వాణీదేవి 56.17 శాతం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు కాస్త గందరగోళానికి గురయ్యారు. భాజపా అభ్యర్థిని తొలగించాలా.. వద్దా అనే విషయమై సుదీర్ఘంగా చర్చించారు.