జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. తక్కువ సమయం ఉండటం వల్ల సాధ్యమైనంత మంది ఓటర్లను నేరుగా కలుసుకునేలా ప్రణాళిక అమలుచేస్తున్నారు. రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రజలను కలుసుకుని మరోసారి తెరాసను ఆశీర్వదించాలని కోరుతున్నారు. సంక్షేమ పథకాలు వివరిస్తూ.. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం తెరాసనే గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. బాగ్‌అంబర్‌పేట తెరాస అభ్యర్థి పద్మావతిరెడ్డికి మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.
మరోసారి గెలిపించాలని..
చందానగర్ అభ్యర్థి మంజుల రఘునాథరెడ్డి.. డివిజన్‌లోని అన్నపూర్ణ ఎంక్లేవ్, గౌతమినగర్, భిక్షపతి కాలనీల్లో పర్యటించారు. తెరాస తరఫున మియాపూర్‌లో పోటీచేస్తున్న ఉప్పలపాటి శ్రీకాంత్.. బీకే ఎంక్లేవ్, ప్రజయ్ సిటీల్లోని ఓటర్లను కలుసుకున్నారు. డివిజన్ సమస్యల పరిష్కారం కోసం తెరాసనే గెలిపించాలని కోరారు. శేరిలింగంపల్లి అభ్యర్థి నాగేందర్ యాదవ్‌కు మద్దతుగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డివిజన్‌లో పర్యటించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా అభివృద్ధి పనులు చేశామని, మరోసారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. జాంబాగ్ డివిజన్ అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్... ఎంజే మార్కెట్‌లోని పూసల బస్తీ, సుందరభవన్‌లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డివిజన్‌లోని సమస్యలను పరిష్కరిస్తానని... నాచారం డివిజన్ తెరాస అభ్యర్థి శాంతి సాయి జెన్ పేర్కొన్నారు. వివిధ కాలనీల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు.