గవర్నర్ వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర శాఖ మౌనంగా ఎందుకు ఉందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో తెరాస, భాజపా దోస్తికి ఇదే నిదర్శనమని ఆయన బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మానవ నిర్మిత అద్భుతం... అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శమని నూతన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాశానికి ఎత్తారని ఆరోపించారు. దూరదర్శన్ వేదికగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే 24 గంటల్లో రాష్ట్రంపై ఇంత అవగాహన రావడం ఒకింత ఆశ్చర్యమే కలిగిస్తోందని ఎద్దేవా చేశారు. రెండేళ్ల కిందట విద్యుత్తు కొనుగోళ్లలో తాను వెలికి తీసిన అవినీతిని తిరిగి తామే బయటకు తీసినట్లు భ్రమలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
తెరాస, భాజపా ఒక్కటేనంటూ రేవంత్ బహిరంగ లేఖ - trs
తెరాస, భాజపా రెండు ఒకటేనని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఫైట్... కేంద్రంలో రైట్ అన్నచందాన ఆ రెండు పార్టీలు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని భాజపా నేతలు ఆరోపిస్తున్నప్పటికీ...కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు విచారణ చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్తు కొనుగోళ్ల అవినీతిపై ఆధారాలను గవర్నర్‌కు అందజేయనున్నట్లు రేవంత్ తెలిపారు. తెరాసతో ఉత్తుత్తి ఫైట్ చేస్తూ... ప్రజలకు భ్రమలు కల్పించినందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కమలం, గులాబీ పువ్వులు కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టాలన్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్‌ది కలియుగ రాచరిక పాలన: ఎంపీ రేవంత్ రెడ్డి