హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని, ప్రజలు తమ అభ్యర్థులను ఆదరిస్తారనే నమ్మకం ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ‘మతతత్వ భాజపా, మజ్లిస్‌కు బుద్ధి చెప్పండి. అవినీతి, అసమర్థ తెరాసను ఓడించండి. అభివృద్ధి ముద్ర ఉన్న కాంగ్రెస్‌ను గెలిపించండి’ అన్నదే మా పిలుపు అని తెలిపారు.
తెరాస-భాజపాలు డ్రామా కంపెనీలు: ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్న:దుబ్బాకలో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కావటంతో మీ పార్టీలో నైరాశ్యం నెలకొందని, ఆ ప్రభావం గ్రేటర్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందనే అభిప్రాయం ఉంది కదా?
జవాబు: ఆ ఎన్నికలు ప్రత్యేకం. అక్కడి భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు మూడుసార్లు ఓడిపోయిన సానుభూతి ప్రభావం ప్రజల్లో కన్పించింది. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వంద నియోజకవర్గాల్లో భాజపా ధరావతు కోల్పోయింది. డబ్బు సంచులతో భాజపా నాయకుడు భూపేంద్రయాదవ్ స్టార్ హోటల్‌లో దిగి, రాత్రివేళల్లో నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులతో నేతలను కొనుగోలు చేయడం తప్ప హైదరాబాద్ అభివృద్ధికి వాళ్లు చేసిందేమీ లేదు. చేసేదీ ఏమీ ఉండదు. భాజపా అధ్యక్షుడు సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను ఆకర్షిద్దామనుకుంటున్నారు. అలాంటి వారి మాటలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వటం దురదృష్టకరం.
ప్రశ్న:కాంగ్రెస్ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో లేదు. గెలిచినా ఎలా అభివృద్ధి చేస్తుందని తెరాస నాయకులు అంటున్నారు. దానికి మీ సమాధానం.
జవాబు: హైదరాబాద్ అభివృద్ధికి ఎవరూ సొంత సొమ్ము ఇవ్వడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఆదాయంలో సింహభాగం ఇక్కడే ఖర్చు చేయాలన్నది మా డిమాండ్. దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు నిధులు ఎలా ఇస్తున్నారో హైదరాబాద్‌కూ అలాగే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వరో చూస్తాం. నిధుల కోసం కొట్లాడతాం.
ప్రశ్న:భాజపా మతతత్వాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్ ప్రశాంతతను దెబ్బతీయాలని చూస్తోందని తెరాస అంటోంది. మీరేమంటారు?
జవాబు: హైదరాబాద్ నగరంపై అవగాహన లేని వారే ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ఇక్కడి ప్రజలు ప్రభావితం కారు. నాకు తెలిసినంతగా హైదరాబాద్ నగరం గురించి ఆయా పార్టీల్లోని నాయకులెవరికీ తెలియదు. నేను చార్మినార్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించా. తెలంగాణ సంస్కృతి ఎలాంటిదంటే శ్రీరామనవమి వేడుకల్లో ముస్లింలూ పాల్గొంటారు. పీర్ల పండుగను హిందువులూ జరుపుకొంటారు. మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు హైదరాబాద్ సహా తెలంగాణ ప్రజలు ప్రభావితం కారు. అలా రెచ్చగొట్టే వారికి బుద్ధి చెబుతారు కూడా.
ప్రశ్న:పీసీసీ నాయకత్వంలో మార్పుల గురించి..
జవాబు:పీసీసీ సారథ్యం చేపట్టేందుకు సమర్థులైన పది, పన్నెండు మంది నాయకులు ఉన్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే. ఎవర్ని నియమించినా అంగీకారమే. ఆ విషయాన్ని అధినాయకత్వానికి చాలాకాలం కిందటే చెప్పా.
ప్రశ్న:అనేక మంది భాజపా ముఖ్య నాయకులు గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. కాంగ్రెస్‌లో అలాంటి పరిస్థితి లేదెందుకు?
జవాబు:భాజపా రాష్ట్ర నాయకత్వంలో పసలేదనే సంకేతంతోనే అగ్ర నాయకత్వం ప్రచారానికి వస్తోంది. నాయకులను కొనుగోలు చేయటానికి కూడా అధినాయకులు వచ్చారు. తెలంగాణకు ఏమిచ్చారని కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ ఇక్కడికి వచ్చారో ఆ పార్టీ నాయకులు సమాధానమివ్వాలి. అమిత్‌షా రాష్ట్రానికి ఏం చేశారో కూడా చెప్పాలి.
ప్రశ్న:తెరాసకు తామే ప్రత్యామ్నాయమని భాజపా నేతలు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత మరింతమంది కాంగ్రెస్ నాయకులు పార్టీలోకి వస్తారనీ అంటున్నారు. దాన్ని ఎలా ఆపగలరు?
జవాబు:ఇది కేవలం గోబెల్స్ ప్రచారమే. వారు చెబుతున్న నేతలు పార్టీలోనే లేరు. వివిధ కారణాలతో రెండు మూడేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి వాళ్లను చేర్చుకుంటూ భాజపా ప్రచారం చేసుకుంటోంది. విజయశాంతిపైనా అలానే ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బలహీనపడదు. గ్రేటర్ ఫలితాలు సంతృప్తికరంగానే ఉంటాయి.
ప్రశ్న:గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపనుంది...
జవాబు:హైదరాబాద్ నగర ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో దగ్గరి సంబంధం ఉంది. నగరంలో ఎటుచూసినా కనిపించేది గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి పనులే. బీహెచ్‌ఈఎల్ మొదలుకుని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వరకు ప్రతిష్ఠాత్మక సంస్థలు ఇక్కడ కొలువుదీరింది, నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృష్ణా, గోదావరి నీళ్లు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోరైలు, అవుటర్ రింగ్ రోడ్డు ఇలా అన్నీ కాంగ్రెస్ పాలనా కాలంలో వచ్చినవే. భాజపా నగరానికి చేసింది సున్నా. పైపెచ్చు రూ.రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడితో ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే, ఆ పార్టీ దాన్ని రద్దు చేసింది. నగరానికి తెరాస చేసిందీ ఏమీ లేదు. సచివాలయం కూల్చడం, విలాసవంతమైన ఇంటిని నిర్మించుకోవటం తప్ప. కరోనాతో ప్రజలు అతలాకుతలం అవుతున్నా, అసమర్థ విధానాలతో నగరాన్ని వరదలు ముంచెత్తి ప్రజలు ప్రాణాలు కోల్పోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ నీరో చక్రవర్తిలా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. కనీసం బాధితులను పరామర్శించలేదు. వరద సాయాన్ని కూడా తెరాస నాయకులు దొంగల ముఠాల మాదిరిగా పంచుకున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు. అందుకే వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారనే నమ్మకం ఉంది.
ప్రశ్న:పరస్పరం ఘాటు విమర్శలు చేసుకుంటున్న తెరాస-భాజపాలు కాంగ్రెస్ ప్రస్తావనే తేవడం లేదు. కాంగ్రెస్ పోటీలో ఉన్నట్లు వారు భావించకపోవడమే దానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమంటారు.
జవాబు:భాజపా, తెరాసలు నాటకాలు ఆడుతున్నాయి. నిజానికి ఆ రెండు పార్టీలు ఒక్కటే. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా తెరాస ఓటు వేసింది. నోట్లరద్దు, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్, కశ్మీరు అంశాల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి మద్దతుగా నిలిచారు. గడిచిన ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ప్రతిపక్షాలను లొంగదీసుకునేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రానికి ఇక్కడి అవినీతి కన్పించడం లేదు. గజ్వేల్‌కు ప్రధానమంత్రి వస్తే నిధులు అడగకుండా నిండు సభలో ‘హమ్‌కో కుఛ్ నై చాహియే... ఆప్ కా ప్యార్ చాహియే’ అని ముఖ్యమంత్రి అనడం దేనికి సంకేతం? గతంలో ప్రధానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆయన్ను పొగిడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే. ఇది డ్రామా కాదా? ఆ రెండు పార్టీలది ‘గల్లీలో కుస్తీ... దిల్లీలో దోస్తీ’ అన్నట్లుగా ఉంది.
ప్రశ్న:ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది?
జవాబు:2023 ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడం ఖాయం. రాష్ట్రంలో మా పార్టీ పునాదులు చాలా బలంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందిస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పవనాలు ఇప్పుడే మొదలయ్యాయి. ముందుముందు అవి నిశ్శబ్ద విప్లవంలా రాష్ట్రవ్యాప్తంగా వీస్తాయి. 2014లో కేసీఆర్ పార్టీపైన ప్రజల్లో ఆశ ఉండేది. క్రమంగా అది తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు పూర్తిగాపోయింది. తెరాసను ఎక్కువ కాలం భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇదే.
ఇవీచూడండి:జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్