TRS On National Politics:: జాతీయ రాజకీయాల దిశగా తెరాస మరోసారి అడుగులు వేస్తోంది. భాజపా వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకెళ్లే కసరత్తు చేస్తోంది. ప్రగతి భవన్ వేదికగా వివిధ రాజకీయ పక్షాల నేతలతో... గులాబీ అధిపతి వరస భేటీలు జరుగుతున్నాయి. గత నెలలో తమిళనాడు వెళ్లిన కేసీఆర్... ఆ రాష్ట్ర సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చించారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కేరళ మంత్రి రాజన్... సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితర సీనియర్ నేతలతో వేర్వేరుగా భేటీ ఆయ్యారు. మంగళవారం బిహార్ విపక్ష నేత, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో సమావేశమయ్యారు. తేజస్వి తండ్రి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తోనూ ఫోన్లో మాట్లాడారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతోనూ ఫోన్లలో సంప్రదింపులు జరుగుతున్నాయి.
భాజపాయేతర కూటమి...
లౌకిక, ప్రజాస్వామిక ప్రధాన ఉమ్మడి అంశంగా కూటమి ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. కేంద్రంలో భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న పార్టీలను ఏకం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో... భాజపాయేతర కూటమి ప్రయత్నాల వేగం పెరిగింది. భాజపా... ముక్త్ భారత్ పేరిట లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని చర్చల్లో నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగైదేళ్లుగా మాట్లాడుతూనే ఉంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ 2019లో పలువురు నేతలను స్వయంగా కలిసి చర్చించారు. కర్ణాటకలో జేడీఎస్ దేవేగౌడ, తమిళనాడులో డీఎంకే స్టాలిన్, ఒడిశాలో బిజూ పట్నాయక్.. జార్ఖండ్‌లో జేఎంఎం శిబు సోరెన్, యూపీలో సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్.. ఏపీలో వైకాపా జగన్, పశ్చిమబంగాల్‌లో టీఎంసీ మమత బెనర్జీ తదితరులతో చర్చలు జరిపారు. కేంద్రంలో భాజపా రెండోసారి తిరుగులేని ఆధిక్యంతో అధికారంలో రావడంతో.. ప్రయత్నాలు కొంత ఆగిపోయాయి.