హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస కార్యకర్తలు రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి (Revanth Reddy's residence siege) యత్నించారు. తెరాస కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. బాహాబాహీకి దిగిన తెరాస, కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు, కర్రలు విసురుకున్నారు. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) దిష్టిబొమ్మ దహనం చేసేందుకు తెరాస కార్యకర్తలు యత్నించారు. తెరాస కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు విసరగా.. కాంగ్రెస్ కార్యకర్తలపై తెరాస కార్యకర్తలు రాళ్లు రువ్వారు.
Revanth Reddy's residence siege : రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత - రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి
15:05 September 21
రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత... తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ
గత కొన్ని రోజులుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతున్న విమర్శలు, ప్రతి విమర్శలే రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి దారితీసింది. రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్‌ను విసిరి కేటీఆర్, కొండా విశ్వేశ్వరరెడ్డి మాదక ద్రవ్యాలు వాడలేదని పరీక్షలు చేయించుకోవాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయనపై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఇవాళ కొంతమంది తెరాస కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వెళ్లారు.
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ఆయన నివాసం వద్దకు వెళ్లిన తెరాస కార్యకర్తలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు తెరాస కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రేవంత్ రెడ్డి ఇంటిని తెరాస కార్యకర్తల ముట్టడి నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయన నివాస పరిసరాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి సమీపంతోపాటు దాదాపు 200మీటర్ల దూరం వరకు ప్రత్యేక పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. తెరాస కార్యకర్తలు విడతల వారీగా రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు అవకాశమున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో భారీ భద్రత చర్యలు తీసుకున్నారు.
రేవంత్ రెడ్డి ఇంటిపై తెరాస కార్యకర్తల దాడిని నిరసిస్తూ సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలను దగ్దం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పిలుపునిచ్చింది. తెరాస అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో దిష్టిబొమ్మలు దగ్దం చేసి నిరసన వ్యక్తం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మంత్రి కేటీఆర్‌కు వైట్ ఛాలెంజ్ విసిరి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేయాలన్న సంకల్పంతోనే రేవంత్ రెడ్డి గన్‌పార్కు వద్ద ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.