'భారత్ విశ్వగురువు ఎప్పుడో అయ్యింది Geetha jayanthi: భారతదేశపు విధానాలను ప్రపంచదేశాలన్ని కీర్తిస్తున్నాయని త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు. గీతా జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో లక్షమంది యువతీ యువకులతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష యువగళ గీతార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భగవద్గీతలోని 40 శ్లోకాలను యువతీ యువకులు సామూహికంగా పారాయణం చేశారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చిన్న జీయర్ స్వామితో పాటు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ గిరి జీ మహారాజ్, అఖిల భారత విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, పూర్వ జేడీ లక్ష్మీనారాయణ, మైహోం రామేశ్వర్‌రావు పలువురు స్వామీజీలు హాజరయ్యారు.
గీతాసారం నిత్యనూతనం..
భగతద్గీతలోని సందేశం మనకెప్పుడూ కొత్తగానే ఉంటుందని చిన్న జీయర్ స్వామి వివరించారు. ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గీత జయంతి ఘనంగా జరిగిందన్నారు. రామాయణం, శ్రీకృష్ణుడి చరిత్ర వాస్తవమని... మన ధర్మాన్ని తరువాతి తరాలకు అందించేలా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేవుడి వైభవాన్ని చాటి చెప్పే బాధ్యత నేటి పాలకులకు ఉందని హితవు పలికారు.
"భగవద్గీత ఆవిర్భవించి లోకాన్ని చూసిన రోజు. భగవద్గీతలోని సందేశం మనకు ఎప్పుడూ కొత్తే. మనందరం బాధ్యతలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కర్తవ్యాన్ని నిర్ణయం చేసుకునే బాధ్యత సమాజంలో అందరిపై ఉంది. మన దేశాన్ని విశ్వ గురువుగా మార్చాలని అందరూ భావిస్తున్నారు. ఇది మనది అనే విశ్వాసాన్ని కోల్పోయాం. శ్రీకృష్ణుడు ఆదేశించినట్లు నువ్వు ఎవరో తెలుసుకుని పని చేయాలి. భారత దేశపు విధానాలను ప్రపంచ దేశాలన్నీ కీర్తిస్తున్నాయి. మనం మాత్రం పుక్కిటి పురాణాలని చిన్న చూపు చూస్తున్నాం. రామాయణం, శ్రీకృష్ణుడు చరిత్ర వాస్తవం. మన ధర్మాన్ని తరువాత తరాలకు అందించేలా సన్నద్ధం అవ్వాలి. దేవుడి వైభవాన్ని చాటి చెప్పాలని నేటి పాలకులకు ఉంది. మన పెద్దలు అందించిన గ్రంధాలను ఆక్షేపించకుండా.. సందేహాలను నివృత్తి చేసుకుందాం. ఆలయాలను పరిరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉంది."- త్రిదండి చిన్న జీయర్ స్వామి
ప్రపంచానికి గీత అవసరం..
గీత జయంతి ఓ పర్వదినమని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిరి జి మహారాజ్ అన్నారు. భగవద్గీత ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసే గ్రంథంగా పేర్కొన్నారు. మానవుడికి భగవద్గీత జీవనజ్యోతిలాంటిదని... పూర్తిగా చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయని వివరించారు. ఈరోజునే అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశారని అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే తెలిపారు. ప్రపంచ మొత్తానికి భగవత్ గీత అవసరమని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: