ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వాగుల ప్రవాహాల కారణంగా వందలాది గ్రామాలు ఏటా అవస్థలు పడుతున్నాయి. మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా ఈ గ్రామాల్లోని గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఏక్షణంలో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందో.. ఎలా చేరుకోవాలో అనేదే వారి ఆందోళన. సకాలంలో వైద్యం అందక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో ఇటీవల నాలుగు నెలల బాబు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఎక్కడెక్కడ..
*ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో లవ్వాల, బంధాల గ్రామాలకు రోడ్డు లేదు. కన్నాయిగూడెం మండలంలోని ఐలాపురం రోడ్డు మార్గం ఏళ్లతరబడి పూర్తికావడం లేదు. ఈ జిల్లాలో రంగాపురం నుంచి భద్రాద్రి జిల్లా సాయనపల్లి వరకు 2019లో 28 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.28 కోట్లు మంజూరవ్వగా కొంతమేర పూర్తయింది. ఇంతలో అటవీశాఖ అనుమతులు లేవని నిలిపివేశారు. వెంకటాపురం-దామరతోగు మధ్య కూడా ఇదే పరిస్థితి.
* భద్రాద్రి జిల్లా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని నదిపై వంతెనలు ఏళ్లతరబడి పూర్తికావడం లేదు. గుండాల నుంచి ములుగు జిల్లా పస్రా మార్గంలో 5 కిలోమీటర్ల మట్టి రోడ్డు నిర్మాణం కూడా ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో వాగులపై వంతెనలు చేపట్టాల్సి ఉంది. టేకులపల్లి- మర్రిగూడ మార్గంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.
* ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని పది మండలాల్లో 40కి పైగా గ్రామాలకు రోడ్లు లేవు. చాలా చోట్ల వంతెనలు నిర్మించాల్సి ఉంది.
* నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో పది చెంచెగూడేలకు కనీస రహదారి లేదు.
* మహబూబాబాద్ జిల్లాలో పాకాల, గంగారం, గూడూరు మండలాల్లో కనీస రహదారులు లేని గ్రామాలు ఉన్నాయి.