కొడంగల్, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని గిరిజనులకు డైరీ డెవలప్మెంట్ కింద పాడి గేదెల పంపిణీ చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి 10 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
'సింగిల్ ఫేజ్ కరెంట్ ఉన్న గిరిజన గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్' - telangana tribal minister satyavathi rathode
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు సింగిల్ ఫేజ్ కరెంటు ఉన్న గిరిజన గ్రామాల్లో వెంటనే త్రీ ఫేజ్ కరెంటు ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
!['సింగిల్ ఫేజ్ కరెంట్ ఉన్న గిరిజన గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్' telangana tribal minister satyavathi rathode](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8578496-631-8578496-1598525658017.jpg)
గిరిజన ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ విద్యుదీకరణ పథకం కింద సింగిల్ ఫేజ్ కరెంట్ ఉన్న 2,221 గిరిజన గ్రామాలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వడం కోసం మొదటి దశలో 117.82 కోట్ల రూపాయలు కేటాయించారని మంత్రి తెలిపారు. వెంటనే ఈ పనులు పూర్తి చేస్తే గిరిజనులకు ఉపయోగపడుతుందన్నారు.
దీనిపై తెలంగాణ ఎన్పీడీసీఎల్ సీఎండీ స్పందిస్తూ ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల గిరిజన గ్రామాల్లో నీరు బాగా ఉందని, వర్షాలు ఆగిపోయిన వెంటనే పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.