మరియమ్మ లాకప్ డెత్ కేసు(Mariamma lockup death case)హైకోర్టు(telangana High Court)లో విచారణకు వచ్చింది. మేజిస్ట్రేట్ నివేదిక రావాల్సి ఉన్నందున ప్రస్తుతం విచారణ వాయిదా వేశారు. మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం సాయం ప్రకటించిందని ఏజీ తెలిపారు.
వారి కుటుంబానికి ప్రభుత్వం.. ఉద్యోగం, ఆర్థిక సాయం ప్రకటించిందని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. ప్రభుత్వ తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని హైకోర్టు(ts high court) ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 2కి వాయిదా వేసింది.
అసలేం జరిగింది..
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో మరియమ్మ అనే ఎస్సీ మహిళ మృతిచెందటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన మరియమ్మ... యాదాద్రి జిల్లా గోవిందాపురంలో చర్చి పాస్టర్ బాలశౌరి ఇంట్లో వంట మనిషిగా పనిచేశారు.
ఈ నెల 3న ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌తోపాటు అతని స్నేహితుడు శంకర్... గోవిందాపురం వచ్చారు. ఈ నెల 5న ఫాదర్ పని మీద హైదరాబాద్ వెళ్లారు. మరుసటి రోజు వచ్చేసరికి... ఇంట్లో 2 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. డబ్బుల విషయమై మరియమ్మను పాస్టర్ ప్రశ్నించారు. మర్నాడు మరియమ్మతోపాటు ఆమె కుమారుడు... రాత్రికి రాత్రే పరారయ్యారు.
సొమ్ము పోయిందని అడ్డగూడురు పోలీస్ స్టేషన్‌లో ఫాదర్ ఫిర్యాదు చేశారు. కేసులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు... ఈ నెల 18న మరియమ్మను పిలిపించారు. విచారణలో భాగంగా... ఆమె స్పృహ కోల్పోయిందని.... భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరియమ్మ మృతిచెందటంతో పోలీసులే అమె మృతికి కారణమని ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయాలన్నీ బయటకు తెలిస్తే ప్రమాదమని భావించిన పోలీసులు... భువనగిరి కేంద్రంగా వ్యవహారం నడిపారు. ఈ నెల 19న ఠాణాలో కాకుండా... రహస్య ప్రదేశంలో ఉదయం నుంచే మంతనాలు సాగించారు. దొంగతనం జరిగిన 2 లక్షల్లో... 90 వేలను అప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో... మరియమ్మ ప్రాణాలు కోల్పోయింది. మరియమ్మ మృతితో ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేయటంతో... ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను సస్పెండ్ చేస్తూ.... రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి:KTR: దూరం తగ్గించడానికే లింకు రోడ్ల నిర్మాణం