తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ.. ఈనెల 9కి వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల కేసులో విచారణ ఈనెల 9కి వాయిదా పడింది. ఈడీ, సీబీఐ కేసులు వేర్వేరుగా విచారణ జరపాలన్న అంశంపై శుక్రవారం విచారణ జరగనుంది.

CM Jagan piracy case news updates
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ.. ఈనెల 9కి వాయిదా

By

Published : Nov 5, 2020, 11:18 PM IST

జగన్ ఆస్తుల కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్లపై విచారణ ఈనెల 9కి వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్‌షీట్‌లో డిశ్చార్జ్ పిటిషన్‌పై జగన్ వాదనలు కొనసాగాయి. ఈడీ, సీబీఐ కేసులు వేర్వేరుగా విచారణ జరపాలన్న అంశంపై రేపు విచారణ జరగనుంది.

జగతి పబ్లికేషన్స్​లో ముగ్గురు వ్యాపారుల నుంచి మోసపూరితంగా పెట్టుబడులు పెట్టించారన్న సీబీఐ అభియోగపత్రం నుంచి తనను తొలగించాలన్న జగన్ డిశ్చార్జ్ పిటిషన్​పై ఈరోజు వాదనలు కొనసాగాయి. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి నాలుగో రోజు సుదీర్ఘ వాదనలు వినిపించారు. పెట్టుబడుల్లో జగన్ ప్రమేయంపై సీబీఐ ఒక్క ఆధారాన్ని కూడా ఛార్జ్​షీట్​తో పాటు సమర్పించలేదని వాదించారు. కంపెనీ, కాంట్రాక్టు చట్టాలకు అనుగుణంగానే పెట్టుబడులు ఉన్నాయన్నారు.

డిశ్చార్జ్ పిటిషన్​తో పాటు జగన్ ఆస్తులకు సంబంధించిన సీబీఐ కేసులన్నీ ఈనెల 9కి ఏసీబీఐ కోర్టు వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల విచారణ కలిపి జరపాలా.. సీబీఐ కేసుల తర్వాత ఈడీ కేసులు మొదలు పెట్టాలా.. లేక ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా వేర్వేరుగా విచారణ చేపట్టాలా అనే అంశంపై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. వేర్వేరు నేరాభియోగాలు కాబట్టి.. వేర్వేరుగా విచారణ జరపాలని ఈడీ కోరగా.. రెండు కలిపి ఒకేసారి.. లేదా సీబీఐ కేసులు తేలిన తర్వాత ఈడీ ఛార్జిషీట్లు విచారణ జరపాలని సీఎం జగన్, విజయ్ సాయిరెడ్డి కోరారు. శుక్రవారం ఈడీ వాదనలు వినిపించనుంది.

ఓఎంసీ కేసుకు సంబంధించి...

మరోవైపు ఓఎంసీ అక్రమాల కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ.. గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం ఓఎంసీ కేసు విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణంపై విచారణను అనిశా న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. మరి కొందరు సాక్ష్యులు, ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని అనిశా కోరింది.

ABOUT THE AUTHOR

...view details