భూ యజమానులందరికీ స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పిస్తేనే గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని మంత్రివర్గ ఉప సంఘం (ధరణి) ఛైర్మన్, ఆర్థికమంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao)కు ట్రెసా విజ్ఞప్తి చేసింది. 13 ప్రధానమైన భూ సమస్యలతో కూడిన నివేదికను ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్‌తో కూడిన బృందం మంత్రికి అందజేసింది.
ధరణి(dharani portal)లో నమోదైన భూములకు సంబంధించి క్రయ విక్రయాల అనంతరం రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు వెను వెంటనే జరుగుతున్నాయని, రికార్డుల్లో యజమానుల పేరు మార్పిడి పూర్తయి పట్టా పాసుపుస్తకం జారీ అవుతోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో నిషేధిత జాబితా (పీఓబీ), విస్తీర్ణంలో వ్యత్యాసాలు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములుగా నమోదుకావడం వంటి కీలక సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్నాయని తెలిపారు. వాటిని తొలగించి స్పష్టంగా హక్కులు కల్పిస్తేనే వాటి యజమానులకు రైతుబంధు, బీమా అందించడానికి వీలుంటుందని వారు తెలియజేశారు. దీనికోసం ధరణిలో అవసరమైన ఐచ్ఛికాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. రెండు మూడు రోజుల్లో ధరణి సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారని భేటీ అనంతరం వారు ఒక ప్రకటనలో తెలిపారు.