తెలంగాణ

telangana

కాళ్లు వణికే పయనం.. కళ్లు తిరిగే గమనం...

By

Published : Nov 2, 2019, 2:12 PM IST

ఊరు దాటి బయటకు వెళ్లాలని చెబితే వాళ్లకు ముచ్చెమటలు పడతాయి. ప్రయాణం చెయ్యాలి అంటే చాలు కాళ్లు వణుకుతాయి. ప్రమాదకరంగా ప్రవహించే గెడ్డపై.. చెట్టునే వంతెనగా చేసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి.  తొమ్మిది గిరిజన గ్రామాల్లోని ప్రజలకు ఈ సమస్య నిత్య నరకం. అయినా పట్టించుకునే నాథుడే లేడు.

కాళ్లు వణికే పయనం.. కళ్లు తిరిగే గమనం

కాళ్లు వణికే పయనం.. కళ్లు తిరిగే గమనం

ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా రాయగఢ సమితిలో ఏ చిన్న పనికి బయటికి వెళ్లాలన్నా గెడ్డ దాటాల్సిందే. ప్రాణాలు అరచేత పట్టుకొని ప్రయాణం చేయాల్సిందే. గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న 6 మాసాలు ఇదే పరిస్థితి. రాయగడ సమితిలోని చంచడా సాహి, తొబార్‌సింగ్‌ గిరిజన ప్రాంతాల్లోవంతెనలు లేక గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. ఏ పనికి వెళ్లాలన్నా చెట్టు ఎక్కి..గెడ్డ దాటాల్సిందే.

చెట్టే ఆధారం

గెడ్డ దాటేందుకు ఉన్న ఏకైక ఆధారం ఓ చెట్టు. ఈ చెట్టు కొమ్మలు గెడ్డపైన సగ భాగం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. గ్రామస్థులు తయారు చేసుకున్న వెదురు కర్ర వంతెన ద్వారా కొమ్మ పైకి చేరుకొని అక్కడి నుంచి చెట్టు మీదుగా అవతలికి చేరుకుంటారు. ఒక పాదం పట్టే స్థలం ఉన్న ఈ చెట్టు కొమ్మపై ఏ మాత్రం అదుపు తప్పినా ప్రమాదమే. గతంలో కొందరు పట్టుతప్పి గెడ్డలో పడి కొట్టుకుపోయిన ఘటనలూ ఉన్నాయి.

తొమ్మిది ఊళ్లకు బాట

రాయగఢ సమితి మార్లబ గ్రామ పంచాయతీ పరిధిలో గల చంచడాసాయి, డుంబాసాయి, నువాసాయి, బల్లిసాయి గ్రామాల గిరిజనులు వారి అవసరాల కోసం బయటకు వెళ్లాలంటే ఈ గెడ్డ దాటాల్సిందే. ఇదే విధంగా తొబార్‌సింగ్‌, లిమిర్‌సింగ్‌, పతిలొడ, గడజుబ, అరు గ్రామాల గిరిజనులు చెట్టు ఎక్కి దాటాల్సిందే. చదువుకొనే విద్యార్థులు పరిస్థితి మరింత దయనీయం. సాంకేతికత సాయంతో ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈరోజుల్లో...గిరిజనులకు తీరైన దారులు లేని పరిస్థితి సవాల్‌ విసురుతోంది.

ఇదీ చదవండి:

ఓ మృగాడి చర్యకు.. ఆ చిన్నారి తల్లైంది...!

ABOUT THE AUTHOR

...view details