Special Story on Ponds in Hyderabad :హైదరాబాద్ నగరంలోని చెరువులు కంపుకొడుతున్నాయి. తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఫలితంగా స్థానికులకు గాలి పీల్చడం కూడా కష్టంగా మారుతోంది. పెరిగిన ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు చెరువు వద్ద ఆగితే.. అక్కడ ఊపిరి ఆగిపోయే దుస్థితి నెలకొంటోంది.
Ponds Stink In Hyderabad Areas : చెరువుల చుట్టూ ఉన్న జనావాసాల నుంచి విడుదలయ్యే మరుగుదొడ్ల వ్యర్థాలతో చెరువులు నిండిపోతున్నా.. మురుగును దారి మళ్లించే ఏర్పాట్లను జలమండలి నత్తనడకన కొనసాగిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మురుగు నీటి మళ్లింపు, చెరువుల ఆక్రమణ, పూడికతీత వంటి కార్యక్రమాలను సకాలంలో చేయడంపై జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారుల మధ్య సమన్వయం ఉండట్లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భరించలేనంతగా బంజారా లేక్:బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లోని తాజ్ బంజారా లేక్(గుళ్ల చెరువు)లో కలిసే వరద కాలువ మురుగు నల్లగా మారి.. అదే ప్రాంతంలో వ్యర్థాలు, బురద పేరుకుపోయాయి. దీంతో వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం తలెత్తి అంబేడ్కర్‌నగర్ బస్తీ నీట మునుగుతోంది. ఇక్కడ దుర్వాసనతో పాటు దోమల బెడద కూడా విపరీతమైంది. చెరువు పరిసర ప్రాంత ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు కాలనీల్లో ఇంటింటి చెత్త సేకరణను నిర్లక్ష్యం చేయడంతో అదంతా తటాకంలోకి చేరుతోంది.