తెలంగాణ

telangana

ETV Bharat / state

Transportation Sector: భారీగా డీజిల్‌ ధరలు... పెరిగిన నిర్వహణ ఖర్చులు - లారీ యజమానులు

Transportation Sector: డీజిల్‌ ధరలు, కరోనా పరిస్థితులు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం లేకపోవడం... వాహనాల యజమానులను అతలాకుతలం చేస్తున్నాయి. దీనికి తోడు పన్నులూ భారంగా పరిణమించాయని తెలంగాణ లారీ యజమానుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. పన్నులు భారం, డీజిల్ ధరలు వంటి పలు కారణాలతో ఎన్నో ఏళ్లుగా ఇదే వ్యాపారంలో ఉన్నవారు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.

Transportation Sector
భారీగా డీజిల్‌ ధరలు

By

Published : Jan 10, 2022, 7:00 AM IST

Transportation Sector: రకు రవాణా రంగాన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల వరకు సరకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటిలో 1.75 లక్షల లారీలు ఉన్నాయి. వీటి ద్వారా ఉపాధిపొందే వారి సంఖ్య 20 లక్షల పైమాటే. కొన్నేళ్లుగా ఈ రంగం తీవ్ర సమస్యలతో కుదుపులకు లోనవుతోంది. డీజిల్‌ ధరలు, కరోనా పరిస్థితులు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం లేకపోవడం... వాహనాల యజమానులను అతలాకుతలం చేస్తున్నాయి. దీనికి తోడు పన్నులూ భారంగా పరిణమించాయని తెలంగాణ లారీ యజమానుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రం చిన్నదిగా మారిన తరవాత కూడా.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నిర్ణయించిన పన్నులే చెల్లించాల్సి వస్తోందని తెలిపింది. గతంలో ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు వాహనాలు నడిచేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం పరిధి తగ్గింది. తెలంగాణ సరిహద్దులో ఉన్న నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని వాహన యజమానుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. కొద్ది కిలోమీటర్ల దూరంలోని సరిహద్దు జిల్లాలకు లోడుతో వెళ్లి రావాలన్నా సింగిల్‌ పర్మిట్‌ తీసుకోవాల్సి రావడంతో నిర్వహణ భారంగా మారిపోయింది. ఈ సమస్యలతో ఎన్నో ఏళ్లుగా ఇదే వ్యాపారంలో ఉన్నవారు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం వైరస్‌ పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఇంకెంత దయనీయంగా మారుతాయోనన్న ఆందోళన యజమానుల్లో ఉంది.

ఒప్పందం జరిగేనా...

సరకు రవాణాను సులభతరం చేసేందుకు సరిహద్దు రాష్ట్రాలు పరస్పర అంగీకార ఒప్పందం చేసుకోవడం పరిపాటి. రాష్ట్రం విడిపోయిన తరవాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య జరగాల్సిన ఒప్పందం ఇప్పటి వరకు జరగకపోవడంతో సింగిల్‌ పర్మిట్‌కు రూ.1,400 చెల్లించాల్సి వస్తోంది. ఒప్పందం జరిగితే ఏటా రూ.5వేలు పన్ను చెల్లిస్తే ఎన్నిసార్లైనా నడపొచ్చు. దీని కోసం కొన్నేళ్లుగా తెలంగాణ లారీ యజమానుల సంఘం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. చివరకు రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద బంద్‌ కూడా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి తెలంగాణ ప్రతినిధులు పరిస్థితిని వివరించడంతో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ముందడుగు పడలేదు.

అపాయింట్‌మెంట్‌ ఇవ్వటం లేదు

సంవత్సరాలుగా పెండింగులో ఉన్న సమస్యలు చెప్పుకొనేందుకు మాకు మంత్రులు, అధికారులు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడంలేదు. పన్నుల రూపంలో పెద్ద మొత్తం ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్నాం. అయినా సరకు రవాణా రంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. డ్రైవర్లకు శిక్షణనిచ్చి ఈ రంగంలో ఉపాధి కల్పించేందుకు అవకాశాలున్నా పట్టించుకోవటం లేదు.

- మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, అధ్యక్షుడు, లారీ యజమానుల సంఘం

15 లారీల్లో 13 అమ్మేశా

30 సంవత్సరాలకుపైగా ఈ రంగంలో ఉన్నాను. గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాపారాలు లేవు. డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. డ్రైవర్‌ ఉద్యోగానికి వచ్చే వారు తగ్గారు. బాడుగతో గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఉన్న 15 లారీల్లో 13 అమ్మేశాను. మిగిలిన రెండింటికి ఎలాంటి రుణాలు లేకపోవటంతో వాటిని ఇంటి దగ్గర పెట్టాను. రాష్ట్రంలో లారీలు కొనుగోలు చేసే వారు తగ్గిపోయారు.

- ఎన్‌.భాస్కర్‌రెడ్డి, లారీ యజమాని, హైదరాబాద్‌

ఇదీ చూడండి:గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కీలక హెచ్చరిక!

ABOUT THE AUTHOR

...view details