ఆర్టీసీ లెక్కల ప్రకారం నగరంలో రోజూ సిటీ బస్సుల్లో 33 లక్షల మంది, ఎంఎంటీఎస్ రైళ్లలో 1.80 లక్షల మంది ప్రయాణించేవారు. వీరిలో అధికులు ఇంటి అద్దెలు తక్కువుంటాయని శివార్లలో నివసిస్తుంటారు. ఇలాంటి వారు పాసింజర్ రైళ్లను అందుకొని కనీస టిక్కెట్ రూ.10తో నగరానికి చేరుకుంటారు. సామాన్యుడి ప్రయాణ వనరులు కరవై ఉద్యోగాలను వదులుకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
ఉద్యోగాలు కోల్పోతున్నారు..
బాలానగర్, కూకట్‌పల్లి, ప్రశాంత్‌నగర్, మూసాపేట, పటాన్‌చెరు ప్రాంతాల్లో 40 వేల వరకూ విస్తరించిన పరిశ్రమల యూనిట్లలో పని చేసే లక్షలాది మంది కార్యక్షేత్రానికి చేరుకోలేక ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. పాతబస్తీ, సికింద్రాబాద్, ఫతేనగర్, సనత్‌నగర్, భరత్‌నగర్, బోరబండ ప్రాంతాల నుంచి అనేకమంది మహిళలు ఇళ్లల్లో పనులు చేసేందుకు ఎంఎంటీఎస్‌లలో రూ.5 టిక్కెట్‌తో మాదాపూర్, కొండాపూర్, కేపీహెచ్‌బీ కాలనీలకు తరలి వచ్చేవారు. ప్రయాణ భారంతో వీరంతా ఇప్పుడు కాలు కదపలేని పరిస్థితి.