రాష్ట్రంలో మద్యం దుకాణాలు దక్కించుకోవడానికి లిక్కర్ వ్యాపారులు అనూహ్యంగా స్పందించారు. ప్రభుత్వానికి దరఖాస్తుల రుసుం కింద దాదాపు రూ.970 కోట్లు రాబడి వచ్చింది. సుమారు 48,500 దరఖాస్తులు వచ్చినట్లు ఆ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా చాలా ఎక్సైజ్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించడం వల్ల పూర్తి వివరాలు రాలేదన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూర్తి స్థాయి వివరాలు అందనున్నాయని కమిషనర్ తెలిపారు. ప్రధానంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి డివిజన్లల్లో దరఖాస్తులు అత్యధికంగా వచ్చినట్లు స్పష్టం చేశారు.
48,500 దరఖాస్తులు... రూ.970 కోట్లు! - liquor applications
మద్యం కోసం నిర్వహించిన టెండర్లలో దాదాపు 48,500 దరఖాస్తులకు గాను ప్రభుత్వ ఖజానాకు రూ.970 కోట్లు సమకూరాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
క్షేత్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన జరుగుతున్నందున మధ్యాహ్నం తర్వాతే వీటి సంఖ్య వెలువరిస్తామని సోమేశ్‌కుమార్ తెలిపారు. ఏపీలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున అక్కడి లిక్కర్ వ్యాపారులు తెలంగాణాలో లిక్కర్ దుకాణాల కోసం పోటీ పడ్డారు. ఫలితంగా గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఎక్సైజ్ యంత్రాంగం పారదర్శకతతో పని చేసిందని సోమేశ్ కుమార్ కొనియాడారు. ప్రభుత్వానికి గతం కంటే రెట్టింపు ఆదాయం సమకూరిందని అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
ఇవీ చూడండి : ఇక చర్చలకు ఆస్కారమే లేదు: సీఎం